Chandrababu Diamond Rakhi: నిజం చెప్పు లేసి బయలుదేరే లోపే.. అబద్ధం ఊరంతా ప్రచారం చేసే రోజులు ఇవి. సోషల్ మీడియా( social media) పుణ్యమా అని తప్పుడు వార్తలు సైతం ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విషయంలో కూడా అదే జరుగుతోంది. వర్షం పడితే చాలు అమరావతి మునిగిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. చివరకు ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత అంశాలను సైతం తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు. వారం రోజుల కిందట చంద్రబాబుకు కట్టిన రాఖీపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. గత శనివారం రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ను ఎవరి స్థాయికి తగ్గట్టు వారు జరుపుకున్నారు. రాజకీయ పార్టీ నేతలకు.. అదే పార్టీలో పని చేసే మహిళా నాయకులు రాఖీ కట్టడం అనేది సర్వసాధారణం. ఇలా సీఎం ఓ సోదరి కట్టిన రాఖీపై రకరకాల ప్రచారం నడిచింది. దీనిపై ఫ్యాక్ట్ చెక్ స్పందించి.. ఏం జరిగింది అనే దానిపై ఒక నిర్ధారణకు వచ్చింది.
Also Read: ఒక్కడికే 15 వేల రాఖీలు కట్టారు.. ఇంతకీ ఆ “ఖాన్ సాబ్” కథ ఏంటంటే?
ప్రశాంతి రెడ్డి పేరుతో ప్రచారం..
ఏపీ సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) చాలామంది మహిళా నేతలు రాఖీలు కడుతుంటారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న సీతక్క ఖచ్చితంగా సీఎం చంద్రబాబు కు వచ్చి రాఖీ కడతారు. తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రబాబు అంటే ఆమెకు చాలా గౌరవం. అందుకే ఆ గౌరవభావంతోనే రాజకీయ సిద్ధాంత పరంగా వ్యతిరేక పార్టీలో ఉన్నా.. వ్యక్తిగతంగా గౌరవిస్తుంటారు. అయితే ఈ ఏడాది చంద్రబాబుకు సీతక్క తో పాటు చాలామంది మహిళా నేతలు రాఖీ కట్టారు. అందులో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఒకరు. అయితే ప్రశాంతి రెడ్డి సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కోటి రూపాయల విలువైన వజ్రంతో తయారుచేసిన రాఖీ కట్టారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇటీవల నెల్లూరు రాజకీయాలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి పై దాడి కూడా జరిగింది. అందుకే ఇప్పుడు ప్రశాంతి రెడ్డి విషయంలో ఏ చిన్న ప్రచారం జరుగుతున్న దానికి ప్రాధాన్యం లభిస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుకు కోటి రూపాయల విలువైన రాఖీ కట్టారంటూ జరుగుతున్న ప్రచారం విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: రాఖీని ఎప్పటి వరకు ఉంచుకోవాలి? ఎప్పుడు తీసేయాలి?
ఫేక్ అంటూ నిర్ధారణ..
అయితే దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్( fact check) రంగంలోకి దిగింది. అదంతా ఉత్త ప్రచారం అని తేల్చింది. ప్రశాంతి రెడ్డి సాధారణ రాఖీ కట్టారని నిర్ధారించింది. ప్రశాంతి రెడ్డికి ఉన్న హైప్ వల్ల వ్యూస్ కోసం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు ఫేక్ ప్రచారం చేశాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఇలా దుష్ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలోని పెదకూరపాడు మండలంలోని ఓ వాగు ప్రవాహం వీడియోను తీసుకొచ్చి.. అమరావతిలో వాగులు పొంగుతున్నాయని ప్రచారం చేశారు. ఓ రెండు టీవీ ఛానల్ తో పాటు సోషల్ మీడియా ఎకౌంట్లో పై కూడా ఫిర్యాదులు అందాయి. అదే కోవలోకి ప్రశాంతి రెడ్డి పై ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది.