Galla Jayadev : ఏపీలో నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. టీటీడీ నుంచి కిందిస్థాయి మార్కెట్ కమిటీల వరకుపదవులు పంపకాలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.అటు జనసేన, బిజెపికి సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి కసరత్తు కూడా ప్రారంభించారు. డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ పోస్ట్ కు పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. మరోవైపు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి పదవి సైతం భర్తీ చేయనున్నారు. 2014 నుంచి 2019 మధ్య ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావు ఉండేవారు. ఈసారి ఆయనకు కాకుండా కొత్తవారిని ఎంపిక చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. స్పీకర్ నుంచి మంత్రి పదవి వరకు ఆశించిన రఘురామకృష్ణంరాజు సైతం ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సైతం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఢిల్లీ వ్యవహారాల విషయంలో చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉన్నారు. వీలైనంతవరకు రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేయాలని భావిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తే.. ఏపీ ప్రజలకు న్యాయం చేయగలమని చూస్తున్నారు. అందుకే ఏపీ ప్రతినిధి విషయంలో అన్ని రకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుంటున్నారు.
* చంద్రబాబు మదిలో..
ఢిల్లీలో ఏపీ ప్రతినిధిగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్ సరిపోతారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 24 వరకు గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా గల్లా జయదేవ్ ఉండేవారు. కానీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్ వైసీపీ సర్కార్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అవసరమైతే త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని అప్పుడే చెప్పారు. అందుకే పార్టీ కోసం గట్టిగానే కృషి చేసిన గల్లా జయదేవ్ అయితే ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా సరిపోతారని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
* విధేయతతో పని చేసిన జయదేవ్
గల్లా జయదేవ్ పార్టీకి ఎంతో విధేయతగా పనిచేశారు. గత ఐదేళ్లుగా ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనా తట్టుకున్నారు. వైసీపీలో చేరాలని ఆయనపై ఒత్తిడి పెంచినా భయపడలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగానే పోరాటం చేశారు. అమరావతి రాజధాని కి అండగా నిలిచారు. అయితే గుంటూరు ఎంపీగా ఉన్న ఆయన అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వాస్తవానికి టిడిపి విజయం పై అనుమానం ఉండడంతోనే గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి దూరమయ్యారని విశ్లేషణలు ఉన్నాయి.
* ఆ అంచనాతోనే
గల్లా జయదేవ్ పార్టీకి ఒక రకమైన మూల స్తంభంగా నిలుస్తారని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. గల్లా జయదేవ్ కుటుంబం పారిశ్రామికంగా ఈ రాష్ట్రానికి సుపరిచితం. పైగా ఆయన సూపర్ స్టార్ కృష్ణ స్వయానా అల్లుడు. మహేష్ బాబుకు బావ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆయనను పార్టీలో కొనసాగించేలా.. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తెచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా గల్లా జయదేవ్ నియామకం దాదాపు ఖరారు అయినట్లు సమాచారం.