Chandrababu : నాకే అర్థం కావడం లేదు.. ఇంత కష్టమనిపించలేదు.. ఏపీ ఆర్థిక లోటుపై చంద్రబాబు సంచలన కామెంట్స్!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటిపోయింది. ఒక్కో వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ కూటమినేతలు వెళ్తున్నారు. ఇందులో చెదరు మదరు ఘటనలు జరుగుతున్నప్పటికీ.. పరిష్కార మార్గం చూపుకుంటూ పయనం సాగిస్తున్నారు.
Chandrababu : ఎన్నికలకు ముందు కూటమినేతలు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈ పథకాలలో కొన్ని ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో విపక్ష వైసిపి ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. తన మీడియా ద్వారా ప్రశ్నిస్తోంది. తన అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కూటమినేతలు కూడా సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యంపై నోరు విప్పడం లేదు. అయితే దీనిపై తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన నోరు విప్పారు. ” ముఖ్యమంత్రిగా నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎన్నో పరిస్థితులను చూశాను. ఎన్నో ఇబ్బందులను దాటుకొని వచ్చాను. చాలావరకు వ్యవస్థలో ఆటుపోట్లు సంభవిస్తే చక్కదిద్దుకుంటూ ఇక్కడిదాకా ప్రయాణం సాగించాను. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది. ఇంత అనుభవం ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది అంటే.. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు ఎటు వెళ్తుందో.. ఎలా చక్కదిద్దాలో కూడా అంతుపట్టడం లేదని” చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితి పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఓ వర్గం మీడియా దీని గురించి పట్టించుకోకపోయినప్పటికీ.. వైసీపీ అనుకూల మీడియా మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది.
పథకాలను ఎగ్గొట్టడానికే..
“అధికారంలోకి రాకముందు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారు.. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం మానివేశారు. సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. అమలు విషయంలో మాత్రం శ్రద్ధ చూపించడం లేదని” వైసిపి నేతలు విమర్శిస్తున్నారు.. మరోవైపు పథకాల అమలుకు సంబంధించి సొంత పార్టీ నాయకులు కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..” ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. కానీ ఇంతవరకు అమలు విషయంలో ఒక అడుగు కూడా ముందు పడలేదు. సొంత పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. వారికి ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలా అయితే ఏం చేయాలో అంతుపట్టడం లేదని” కూటమి ఎమ్మెల్యేలు అంటున్నారు. ” ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు తెలియదా.. జగన్ వివిధ పథకాలు అమలు చేస్తున్నప్పుడు ప్రభుత్వ డబ్బులను పప్పు బెల్లం లాగా పంచి పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అలాంటి హామీలనే చంద్రబాబు ఇచ్చారు కదా. నాడు ఏపీ రాష్ట్రాన్ని అప్పలపాలు చేశారని జగన్ మీద విమర్శలు చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు పథకాలను ఎందుకు అమలు చేయడం లేదు.. అలాగని అప్పులు చేయకుండా ఉండడం లేదు కదా.. నాడు అధికారంలోకి రావడం కోసం జగన్ మీద లేనిపోని విమర్శలు చేశారు. ప్రజలకు అనేక రకాల పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా సాకులు చెబుతున్నారని” వైసిపి నాయకులు అంటున్నారు. సూపర్ సిక్స్ కు ఆఖరి రాగం పాడేశారని వైసిపి నాయకులు విమర్శిస్తున్నారు.