Chandrababu: చంద్రబాబుపై ఏపీ సిఐడి పట్టు బిగిస్తోంది. ఇప్పటికే అవినీతి కేసుల్లో చంద్రబాబు బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. దాదాపు 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపారు. తనపై కేసులు నమోదు తో పాటు అరెస్టులో కనీస నిబంధనలు పాటించలేదని కారణం చూపుతూ.. కేసులు కొట్టివేయాలని చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వులో చేశారు. హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ లభించడానికి సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇటువంటి తరుణంలో ఫైబర్ నెట్ కేసులో సిఐడి చార్జిషీట్ దాఖలు చేసింది. ఏ 1 నిందితుడిగా చంద్రబాబు పేరును చేర్చింది.
టిడిపి ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారు. సిట్ దర్యాప్తులో 121 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తేల్చారు. 19 మంది పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ 1గా వేమూరి హరిప్రసాద్, ఏ 2గా మాజీ ఎండి సాంబశివరావు పేరు నమోదు చేశారు. ఏ 25 గా చంద్రబాబు పేరును చూపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సమయంలో ఏపీ ఫైబర్ నెట్ అవినీతి కేసు కూడా బయటకు తెచ్చారు.
చంద్రబాబు అవినీతి కేసుల్లో వరుసుగా చార్జిషీట్లు వేస్తున్న నేపథ్యంలో నిందితుల పేర్లు మార్చుతూ సిఐడి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారుతోంది. ఎన్నికల ముంగిట చంద్రబాబుపై పట్టు బిగించేందుకే నన్న టాక్ నడుస్తోంది. చంద్రబాబును ఏ1 నిందితుడిగా, వేమూరి హరి ప్రసాద్ ను ఏ2 గా, సాంబశివరావు ఏ3గా చూపుతూ సిఐడి దాఖలు చేయడం విశేషం. మూడేళ్ల కిందట ఒకలా.. ఇప్పుడు మరోలా నిందితులను చూపిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు కేసుల్లో సిఐడి మళ్ళీ స్పీడ్ పెంచినట్లు కనిపిస్తోంది.