Chandrababu Bail: చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం అశేష జనవాహిని ఎదురుచూస్తుండగా ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వెల్లడించగా.. సాయంత్రానికి బెయిల్ ప్రక్రియ పూర్తయింది. చంద్రబాబు విడుదల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో టిడిపి శ్రేణులు జైలు వద్దకు చేరుకున్నాయి. అధినేతకు వారు సాదరంగా స్వాగతం పలికారు. దీంతో రాజమండ్రి జైలు ప్రాంగణం రద్దీగా మారింది.
జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబుకు కుటుంబ సభ్యులు నారా లోకేష్, బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు, పయ్యావుల కేశవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరావు, టీడీ జనార్దన్ తదితరులు జైలు వద్దకు విచ్చేశారు. అధినేతకు సాదరంగా స్వాగతం పలికారు. నేతలతో పాటు కార్యకర్తలను చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. అయినా అదుపు చేసుకుని చిరునవ్వుతో ముందుకు సాగారు. విక్టరీ సంకేతాలతో కార్యకర్తల్లో ఉషారు నింపారు.

తమ అధినేత 53 రోజులుగా జైల్లో ఉండి పోవడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందాయి. ఎట్టకేలకు బెయిల్ లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు రాజమండ్రి కి చేరుకున్నాయి. రాజమండ్రి నగరంతో పాటు రూరల్ నియోజకవర్గాల నుంచి భారీగా టిడిపి శ్రేణులు తరలిరావడంతో పట్టణం పసుపు మయంగా మారింది. టిడిపి శ్రేణులను నిలువరించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ప్రత్యేకంగా బారికేట్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తోసుకుంటూ కార్యకర్తలు జైలు వద్దకు దూసుకొచ్చారు. జైలు పరిసర ప్రాంతాలు చంద్రబాబు నినాదాలతో హోరెత్తాయి.


