Chandrababu
Chandrababu: ఏపీలో కూటమి గెలుపు వెనుక పవన్ పాత్ర మరువరానిది. పవన్ దూకుడు, టిడిపి క్షేత్రస్థాయిలో బలం, చంద్రబాబు నాయకత్వం, బిజెపి మద్దతు కలగలిపి.. ఏపీలో కూటమి అధికారంలోకి రాగలిగింది. అందుకే పవన్ లేనిదే కూటమి లేదని.. పవన్ లేనిదే నేను లేనని చంద్రబాబు గంటాపథంగా చెప్పుకొస్తున్నారు. పవన్ కోసం చంద్రబాబు అద్భుత నిర్ణయాన్ని తీసుకున్నారు. తన తరువాత అంతటి పదవి, అంతటి హోదా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. కీలక మంత్రిత్వ శాఖ తో పాటు డిప్యూటీ సీఎం పదవిని పవన్ కు ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. అయితే దశాబ్ద కాలంగా డిప్యూటీ సీఎం పోస్టు అంటే ఒక రకమైన అపవాదు ఏర్పడింది. దానిని మార్చుతూ.. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ ఉండేలా పదవులను బలోపేతం చేయనున్నారు చంద్రబాబు.
కాంగ్రెస్ పార్టీలోడిప్యూటీ సీఎం పదవికి ఒక హోదా ఉంటుంది. ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుంది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పదవి పోస్టుకు ప్రాధాన్యం తగ్గింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. నిమ్మకాయల చినరాజప్ప తో పాటు కేఈ కృష్ణమూర్తికి ఛాన్స్ ఇచ్చారు. సీనియర్లు కావడం, సామాజిక సమతూకం పేరిట వారికి అవకాశం ఇచ్చారు. అయితే అప్పట్లో వారికి ప్రాధాన్యం అంతంత మాత్రమే. అటు తరువాత జగన్ ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. అయితే అవి ఉత్సవ విగ్రహాలే అన్నట్టు పరిస్థితి ఉండేది.డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న మంత్రులకు సొంత శాఖల్లో కూడా కనీసం పట్టు లేదన్న విమర్శ ఉంది. అయితే వీటన్నింటికీ చెక్ చెబుతూ చంద్రబాబు పవన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటున్నానని చంద్రబాబు ప్రకటించారు. పవన్ అండగా నిలవడంతోనే తాను నిలిచాను అన్న విషయాన్ని చెప్పుకొస్తున్నారు. పవన్ తన కింద పని చేయడం కాదని.. తాను మాత్రం పవన్ తో కలిసి పని చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తద్వారా పవన్ కళ్యాణ్ కు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనున్నారో చెప్పకనే చెప్పారు చంద్రబాబు. డిప్యూటీ సీఎం పోస్టును.. అత్యంత బలమైన శక్తిగా మార్చి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దశాబ్ద కాలం కిందట డిప్యూటీ సీఎం పోస్టు ఏ స్థాయిలో ఉండేదో.. అదే స్థాయిని పవన్ కు అప్పగించాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.