Chandrababu Birth Day: చంద్రబాబు.. గత నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. ఈ రాష్ట్రానికి 14న్నర సంవత్సరాలు పాటు సీఎం గా చేశారు. మిగిలిన కాలం అంతా ప్రతిపక్షనేతగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులోనే మంత్రిగా చేశారు. ఆయన చూడని పదవి లేదు. అనుభవించని అధికారం లేదు.కుప్పం నుంచి ఢిల్లీ రాజకీయాల వరకు ఆయన శాసించారు.అయితే ఆయన రాజకీయ జీవితం పూల పాన్పు కాదు. ఎన్నెన్నో చిక్కుముడులను, సంక్షోభాలను, అపవాదులను దాటుకొని లక్ష్యానికి చేరుకోగలిగారు. అటువంటి నేత ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కష్టపడాల్సి రావడం విశేషం.ఏడుపదుల వయసులో అలవోకగా నెగ్గాల్సిన ఆయన తనకంటే చిన్నవాడైన జగన్తో పోరాటం చేస్తున్నారు.ఈరోజు ఆయన జన్మదినం. 74వ పడి నుంచి 75వ పడిలో పడుతున్నారు. ఈ సందర్భంగా ఓకే తెలుగు ప్రత్యేక కథనం.
1978 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 1983 నాటికే మంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్టీఆర్కు అల్లుడు అయ్యారు. మామ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినా.. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తన మామ పార్టీ టిడిపి అభ్యర్థి చేతిలోనే ఓడిపోయారు.తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఎటువంటి పదవులు చేపట్టలేదు. పార్టీని సమన్వయం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంతటి సంక్షోభంలో కూడా పార్టీ శ్రేణుల అభిమానాన్ని చంద్రబాబు పొందగలిగారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు మాత్రమే టిడిపిని నడపగలరని సొంత పార్టీ శ్రేణులు నమ్మేస్థితికి చంద్రబాబు చేరుకున్నారు. ఆ నమ్మకమే చంద్రబాబును నడిపించింది. సుదీర్ఘకాలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది. ప్రతిపక్ష నేతగా సైతం కొనసాగింపునకు దోహద పడింది.
పడిపోయిన ప్రతిసారి పడి లేచిన కెరటంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆ నమ్మకంతోనే 2024 ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తుందన్న నమ్మకం సగటు అభిమానిలో ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. ఇక పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ చంద్రబాబు తన శక్తి యుక్తులతో, సహనంతో పార్టీని నడిపారు. అనతి కాలంలోనే పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులుగా చేశారు.ప్రస్తుతం జగన్ బలంగా ఉన్నారు. అందుకే తన నాలుగున్నర దశాబ్దాల సీనియార్టీని రంగరించాల్సి వచ్చింది. బలమైన ప్రత్యర్థి ఉండడంతో పొత్తులతోనే చిత్తు చేయవచ్చని చంద్రబాబు ఆలోచన చేశారు.అయితే బిజెపి, జనసేనకు తక్కువ సీట్లు ఇవ్వడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు. ఒకవైపు వైయస్ కుటుంబ సభ్యులను సైతం వాడుకుంటున్నారు. వారితోనే జగన్కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్యలాంటివి.పార్టీ నిలబడాలంటే గెలుపు అనివార్యం. పైగా చంద్రబాబు వయసు 7 పదులు దాటింది. మరో ఎన్నికకు వయసు సహకరించే అవకాశం లేదు. అందుకే ఈ ఎన్నికల్లో విక్టరీ సాధించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. అంతటి వయసులో కూడా కాలికి బలపం కట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ఆయన పడుతున్న శ్రమ చూసి సొంత పార్టీ శ్రేణులు బాధపడుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు టిడిపి శ్రేణులకు టానిక్ లా పనిచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని శ్రమిస్తున్నారు. మరి ఆయన శ్రమ ఫలిస్తుందో? లేదో? చూడాలి.