Nara Lokesh National Working President: తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియమితులయ్యారు. నిన్ననే తెలుగుదేశం పార్టీ కమిటీలను సమూల ప్రక్షాళన చేసి ప్రకటించారు. సీనియర్లతోపాటు జూనియర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ప్రధానంగా లోకేష్ ఎంపిక వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు అర్థం అవుతోంది. ప్రస్తుతానికి పార్టీపై పూర్తి పట్టు సాధించారు లోకేష్. ఈ తరుణంలో తరచు లోకేష్ సీఎం అనే మాట బయటకు వస్తోంది. మరోవైపు చంద్రబాబు యాక్టివ్ గానే ఉన్నారు. మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆరోగ్యంతో పాటు వయసు సహకరిస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తి ఫిట్నెస్ కు ప్రాధాన్యమిస్తారు. మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఏపీని ఒక రూపంలోకి తేవాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అయితే జాతీయ స్థాయిలో సమన్వయం ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అవసరం. ఆ అవసరం దృష్ట్యా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లోకేష్ కు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
* కేంద్రంతో సమన్వయానికి..
ప్రధానంగా మంత్రి లోకేష్( Minister Lokesh) ఏపీ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం చంద్రబాబు పాలన పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటు గ్రామీణ అభివృద్ధి పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల్లో మంత్రి లోకేష్ విదేశీ పెట్టుబడులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంలో జాతీయస్థాయి సహకారం అవసరం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు. ఒక విధంగా ఇది లోకేష్ కు పట్టాభిషేకమే.
* జాతీయస్థాయిలో రాటు దేలాలని
ఏపీ సీఎం చంద్రబాబు కు( AP CM Chandrababu) ఎన్నో రకాల రాజకీయ కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో ఆయనకు జాతీయస్థాయిలో పరిచయాలు ఎంతగానో దోహదపడ్డాయి. ఆ పరిచయాలతోనే రాజకీయ ఇబ్బందులను అధిగమించగలిగారు చంద్రబాబు. అయితే 2023 సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ జాతీయ స్థాయిలో తన తండ్రి అరెస్టుపై గట్టిగానే పోరాటం చేశారు. అప్పటినుంచి చంద్రబాబు సైతం లోకేష్ ను జాతీయస్థాయిలో ప్రమోట్ చేయాలని భావించారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర పెద్దలతో లోకేష్ కు సాన్నిహిత్యం పెంచేలా చేశారు. లోకేష్ కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. కేంద్ర పెద్దలు గుర్తించేలా తనను తాను మార్చుకున్నారు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కేంద్ర పెద్దల నుంచి లోకేష్ కు పిలుపు వస్తోంది. ఎన్డిఏ పరంగా ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక ఆహ్వానం వస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ వద్ద కూడా పరపతి పెంచుకున్నారు లోకేష్. యోగాంధ్రా వేడుకలను నిర్వహించి.. సమర్థవంతమైన నాయకత్వం లోకేష్ వద్ద ఉందని గుర్తించేలా చేశారు. ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించి లోకేష్ తో చర్చలు జరిపారు అంటే ఆయన స్థాయి ఏ స్థాయిలో పెరిగిందో అర్థం అవుతోంది. ప్రస్తుతానికి రాష్ట్ర పాలనలో సీఎం చంద్రబాబుకు డోకా లేదు. పవన్ సాయం ఎలానూ ఉంది. అందుకే జాతీయస్థాయిలో లోకేష్ ను మరింత ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
