Homeఆంధ్రప్రదేశ్‌NTR : చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు: అయినా ఎన్టీఆర్ మొండిఘటం

NTR : చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు: అయినా ఎన్టీఆర్ మొండిఘటం

NTR : ఎన్టీఆర్.. నేడు ఆ మహానటుడి 100వ జయంతి. సినీ రంగంలో, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ఎన్నో విలువలు నెలకొల్పారు. అనితర సాధ్యమైన పనులు చేసి ఔరా అనిపించారు. నేటికీ కూడా తెలుగు ప్రజలు స్మరించుకుంటున్నారంటే ఆయన చేసిన మంచి పనులే. కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. నమ్మి చేరదీసిన అల్లుడు వెన్నుపోటు పొడిచాడు. నా అన్న వాళ్లు దూరం పెట్టారు. ఇక కొన్ని పత్రికలు అయితే బతికుండగానే నరకం చూపించాయి. కానీ ఎన్టీఆర్ ఉద్దండ పిండం కాబట్టి వాటన్నింటినీ ఎదుర్కొన్నాడు. కానీ చివరికి మృత్యువు చేతిలో ఓడిపోయాడు. ఆ మనిషి గతించి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. నేటికీ ఆయన చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తుకే ఉన్నాయి. నేడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని ముఖ్యమైన రాజకీయ ఘట్టాలు మీకోసం..
ఇందిరాగాంధీని ఎదిరించాడు
ఇందిరా గాంధీ ఒంటి చేత్తో దేశ రాజకీయాలను శాసిస్తున్న రోజులవి. అప్పట్లో ఆమెను రాజకీయంగా ఢీకొనడానికి ఎవరూ సాహసించని పరిస్థితి. అలాంటిది ఎన్టీఆర్‌ ప్రాంతీయ పార్టీని స్థాపించడంతో పాటు ఇందిరపైనే రాజకీయ యుద్ధం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే తనను పాతాళానికి తొక్కేసే ప్రమాదం ఉందని తెలిసినా వెనుకంజ వేయలేదు.  1982లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవడానికి టీడీపీకి తగినంత సమయం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం అప్పట్లో ఎన్నికలను ముందుకు జరిపింది. అయినా ఏమాత్రం బెదరలేదు. చైతన్య రథంలో నేరుగా ప్రజల్లోకి వెళ్లి మొండిగా పోరాడారు. దారిలో ప్రజలందరికీ కనిపించడం కోసం మైళ్ల తరబడి వాహనంపై అలాగే కూర్చునేవారు. ఒక రోజు రాత్రిపూట రైల్వే గేటు వద్ద ఇనుప గేటు తగిలి ఆయన తలకు పెద్ద గాయమైంది. అయినా ఒక్క రోజు కూడా పర్యటన ఆపలేదు.  అప్పటి వరకూ సినిమా హీరోగా సౌకర్యవంతమైన జీవితం గడిపిన ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆ సౌకర్యాలన్నింటినీ పక్కనపెట్టారు. రాష్ట్ర పర్యటనలో రోడ్డు మీదే స్నానపానాదులు పూర్తి చేసేవారు..
9 నెలల్లో అధికారం
ఎన్నికల సమయంలో పార్టీలతో పొత్తు లేకుండానే పోటీ చేశారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాదిన్నర వ్యవధిలోనే కుట్ర పన్ని టీడీపీలో చీలిక తెచ్చి ఆయనను సీఎం పీఠం నుంచి దించివేశారు.  అంతకు కొన్ని రోజుల ముందే అమెరికాలో ఆయన గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చారు. కొన్ని రోజులు బయటకు కదలవద్దని వైద్యులు చెప్పినా… ప్రజలను చైతన్య పర్చడానికి రాష్ట్రమంతా తిరిగారు అప్పట్లో 30 రోజుల్లో మూడు సంపూర్ణ బంద్‌లు జరిగాయి. ఎన్టీఆర్‌ ప్రతిపక్ష పార్టీలను ఉద్యమంలోకి కూడగట్టగలిగారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉండేలా చూసుకున్నారు. ఈ ఉద్యమం ఉధృతికి ఇందిరా గాంధీ సైతం దిగివచ్చి, నెల రోజుల్లోనే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు.
కాంగ్రెస్‌ దెబ్బకు పదవీకాలం పూర్తికాకుండానే ఒకసారి తన ప్రభుత్వం అర్ధాంతరంగా పడిపోయినా ఎన్టీఆర్‌ ఏమాత్రం బెదరలేదు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా
 కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేశారు. సైద్ధాంతికంగా వేర్వేరు దారుల్లో ఉన్న జన తాదళ్‌, బీజేపీ, వామపక్షాలు, వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కూడగట్టి సదస్సులు నిర్వహించారు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా ఉండి జాతీయ అధికార పార్టీపై పోరాటానికి అందరినీ కూడగట్టేందుకు ధైర్యం చేయడం ఎన్టీఆర్‌ ప్రత్యేకత. ఆయన కృషితో జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలతో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటైంది. దానికి ఆయనే అధ్యక్షుడుగా వ్యవహరించారు. 1989 ఎన్నికల్లో కేంద్రంలో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం పరాజయం పాలై.. వీపీ సింగ్‌ నాయకత్వంలో ప్రతిపక్ష కూటమి అధికారంలోకి రావడానికి ఎన్టీఆరే పునాది వేశారు. ఎన్టీఆర్‌ దూకుడును ఆపడానికి రాజీవ్‌ ప్రభుత్వం గవర్నర్‌ కుముద్‌బెన్‌ జోషిని ముందు పెట్టి రకరకాల ఒత్తిళ్లు ప్రయోగించినా ఆయన లొంగలేదు.
‘ఇందిర’ సానుభూతి పవనాల్లోనూ…
1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు. ఆ ఏడాది చివర్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దేశవ్యాప్తంగా  సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఆ ప్రభావం కనిపించలేదు. ఎన్టీఆర్‌ను బలవంతంగా ముఖ్యమంత్రి పీఠం నుంచి దించారని కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు టీడీపీకి పట్టం కట్టారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో మిత్రపక్షాలతో సహా టీడీపీకి 35 సీట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ తర్వాత అత్యధిక ఎంపీ సీట్లు గెలిచింది టీడీపీనే. దేశ చరిత్రలో మొదటిసారి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ వ్యవహరించిన ఘనత టీడీపీకి దక్కింది.
ఆ ఘటన ఆత్మగౌరవం నినాదాన్ని తెరపైకి తెచ్చింది
 అది 1982, ఫిబ్రవరి నెల. వేదిక బేగంపేట విమానాశ్రయం. కాంగ్రెస్‌ దివంగత నేత రాజీవ్‌గాంధీ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన రోజులవి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా రాజీవ్‌కు ఘనస్వాగతం పలికేందుకు అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య భారీ సంఖ్యలో కార్యకర్తలు, బ్యాండ్‌ మేళాలతో తరలివెళ్లారు. ఈ హడావుడి చూసి రాజీవ్‌కు చిర్రెత్తుకొచ్చింది.. ఏమిటీ హడావుడి..అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అంజయ్య చిన్నబుచ్చుకున్నారు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రాజీవ్‌ ఆగ్రహం నేపథ్యంలో, ఆ తర్వాత కొద్దిరోజులకే అంజయ్య సీఎం పదవి కోల్పోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తెలుగువాడికి, అందునా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తీవ్ర అవమానం జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అప్పుడు మద్రాస్ లో   ఉన్న ఎన్టీఆర్‌ దృష్టికి కూడా ఈ ఘటన సమాచారం వెళ్లింది. తెలుగువారిని ఉత్తరభారతదేశంలో ఎక్కడకు వెళ్లినా మదరాసీలు అంటూ పిలుస్తుండడం అప్పటికే ఎన్టీఆర్‌ను ఎంతగానో బాధిస్తోంది. అంజయ్య ఘటనతో ఆత్మగౌరవ నినాదం ఆయనలో రూపుదిద్దుకొంది. ముఖ్యమంత్రిని అవమానించిన ఘటనను ఎన్టీఆర్‌…  పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లిన తొమ్మిది నెలల ప్రచారం సందర్భంగా ప్రధానాస్త్రంగా మలుచుకున్నారు. ఆత్మగౌరవ నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పరిణామం…అప్పటివరకు ఏకచ్ఛత్రాధిపత్యం సాగించిన కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీసింది.
ప్రజల చెంతకు రాజకీయం
ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందు జమీందార్లు, బాగా ఆస్తిపరులు రాజకీయాలను శాసించేవారు. ముఖ్యంగా ఒకటి రెండు సామాజిక వర్గాల వారే ప్రాతినిధ్యం వహించేవారు. పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాల నుంచే ఎక్కువమంది ఎమ్మెల్యేలుగా గెలుపొందేవారు.  ఎన్టీఆర్‌ పార్టీ పెట్టాక ఈ పరిస్థితిని చాలా వరకు మార్చేశారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన చదువుకున్న యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ కులాల వారిని ప్రోత్సహించి టికెట్లు ఇచ్చారు.  పార్టీలో క్రమశిక్షణకు ఎన్టీఆర్‌ ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంతో పాటు క్రమం తప్పకుండా సమావేశాలు జరిపించేవారు. ఏటా విధిగా మూడు రోజులపాటు మహానాడు సమావేశాలు జరుగుతుండేవి. పార్టీ నేతలకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఏటా శిక్షణ శిబిరాలు నిర్వహించేవారు. ప్రతి రెండేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదు తప్పనిసరి. ఎవరైనా పార్టీ గీత దాటితే ఊరుకొనేవారు కాదు.
ప్రజలు నేరుగా ఎన్నుకునేలా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులు, అవిశ్వాస తీర్మానాల బెడద తగ్గించడానికి.. సర్పంచ్‌, ఎంపీపీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌, మునిసిపల్‌ చైర్మన్‌, కార్పొరేషన్‌ మేయర్‌ను  ప్రజలు నేరుగా ఎన్నుకునేలా చేశారు. దీనివల్ల ఈ సంస్థలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు బాగా ప్రాధాన్యం ఇచ్చి కింది స్థాయి నుంచి రాజకీయ నాయకత్వం ఎదగడానికి ప్రాధాన్యం ఇచ్చారు. మొదటిసారి ఈ ఎన్నికల్లో బీసీలకు ఇరవై శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అప్పటిదాకా బీసీలకు రిజర్వేషన్లు లేవు. అలాగే మహిళలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి ఎన్టీఆర్‌ హయాంలో బీసీ వర్గాలకు చెందిన ఏడుగురు జడ్పీ చైౖర్మన్లు అయ్యారు. వారిలో దేవేందర్‌ గౌడ్‌ ఒకరు. తూర్పు గోదావరి జడ్పీ చైర్మన్‌గా పనిచేసిన జీఎంసీ బాలయోగి తర్వాతి కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.   1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో చాలామంది రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఉదాహరణకు యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులుకు నల్లగొండ జిల్లా ఆలేరు టికెట్‌ ఇచ్చారు. ఇలా ఎంతోమంది సామాన్యులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మంత్రి పదవులనూ చేపట్టారు.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version