CM Chandrababu: చంద్రబాబు హామీ.. గంటల వ్యవధిలో గుమ్మం ముందు ఎలక్ట్రిక్ ఆటో

సాధారణంగా చంద్రబాబు సంక్షేమానికి దూరంగా ఉంటారు. కానీ స్వయం ఉపాధి పథకాలకు మాత్రం పెద్దపీట వేస్తారు. మొన్న అన్న క్యాంటీన్లో ప్రారంభోత్సవానికి గుడివాడ వెళ్లిన ఆయన ఓ ఆటో డ్రైవర్ కు హామీ ఇచ్చారు. గంటల వ్యవధిలోనే ఆ హామీని నెరవేర్చారు.

Written By: Dharma, Updated On : August 17, 2024 10:41 am

CM Chandrababu(7)

Follow us on

Cm chandhrababu : సాధారణంగా ప్రభుత్వం తరుపున సాయం అంటే నెలల సమయం పడుతుంది. చాలా రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ దాటాకే సాయం అందుతుంది. కానీ గుడివాడలో మాత్రం ఓ ఆటో డ్రైవర్ కు ప్రభుత్వం గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్ ఆటోను సమకూర్చింది. ఓ పేద ఆటో డ్రైవర్ కు ఇచ్చిన హామీను నెరవేర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. గుడివాడలో సీఎం చంద్రబాబు లాంఛనంగా క్యాంటీన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో ఆహార పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఆటో డ్రైవర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా టిడిపి ప్రభుత్వం ఆటోను సమకూర్చిందని.. ప్రస్తుతం డీజిల్ ఖర్చులు పెరగడంతో ఇబ్బందికరంగా మారిందని.. ఎలక్ట్రికల్ ఆటోను మంజూరు చేస్తే ఉపాధి లభిస్తుందని సదరు ఆటో డ్రైవర్ చెప్పాడు. దీనికి చలించి పోయిన చంద్రబాబు ఎలక్ట్రికల్ ఆటోను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గంటల వ్యవధిలోనే అందించారు. దీనికి సదరు ఆటోడ్రైవర్ కుటుంబం ఆశ్చర్యపోయింది. గంటల వ్యవధిలోనే ఆటోను సమకూర్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. సీఎం చంద్రబాబు స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సంక్షేమం విషయంలో గతం కంటే భిన్నంగా చంద్రబాబు ఆలోచిస్తుండడం విశేషం.

* గతంలో ఆటో ఇచ్చిన టిడిపి ప్రభుత్వం
కృష్ణాజిల్లా గుడివాడ మండలం వలి వర్తిపాడుకు చెందిన రేమల్లి రజినీకాంత్ ఆటో డ్రైవర్. గతంలో టిడిపి ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆయనకు ఆటో అందించారు. అదే ఆటో ఆ కుటుంబానికి జీవనంగా మారింది. ప్రస్తుతం రజినీకాంత్ ఇద్దరు పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు. కుమారుడు రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె బీడీఎస్ చదువుతోంది. తండ్రి రజనీకాంత్ ఆటో నడపగా వచ్చిన మొత్తం తోనే వీరి కుటుంబం గడిచేది.

* ఇబ్బందిగా ఉందని చెప్పడంతో
గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ రజినీకాంత్ తో మాట్లాడారు చంద్రబాబు. గతంలో టిడిపి హయాంలో మంజూరు చేసిన ఆటో తోనే తన కుటుంబ జీవనం గడిచిందని.. ఇద్దరు పిల్లల చదువు పూర్తవుతోందని వివరించాడు రజనీకాంత్. డీజిల్ ఖర్చులతో పాటు నిర్వహణ భారంగా మారడంతో డీజిల్ ఆటో బదులు.. ఎలక్ట్రికల్ ఆటో మంజూరు చేయాలని కోరాడు. దీంతో ఎలక్ట్రికల్ ఆటో మంజూరుకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో రజినీకాంత్ సంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి కొద్ది రోజుల సమయం పడుతుందని భావించాడు.

* వేగంగా స్పందించిన యంత్రాంగం
అయితే గంటల వ్యవధిలోనే రూ. 3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను రజనీకాంత్ కు ప్రభుత్వం అందించింది. కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్డిఓ నిమ్మగడ్డ శ్రీనివాస్ గురువారం రాత్రి అపే ఈ సిటీ ఆటో తీసుకున్నారు. ఆటోను గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆటో పంపించడం ఆనందంగా ఉందని రజినీకాంత్ చెప్పుకొచ్చాడు. తన జీవితంలో చాలా మంది నేతలను చూశానని.. చంద్రబాబు వంటి నేతను ఇంత దగ్గరగా చూడలేదన్నారు. ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరిచిపోదని చెప్పుకొచ్చారు.