Homeఆంధ్రప్రదేశ్‌ఐటీ ఉద్యోగులకు భయపడుతున్న జగన్.. తిరుగుబాటు మొదలైనట్టేనా?

ఐటీ ఉద్యోగులకు భయపడుతున్న జగన్.. తిరుగుబాటు మొదలైనట్టేనా?

Chandrababu Arrest : ఎవ్వరు ఔనన్నా కాదన్నా ఐటీ ఇండస్ట్రీకి ఊపిరి లూదింది చంద్రబాబే. అందుకే తమకు ఇంత బతుకునిచ్చిన చంద్రబాబు కోసం ఈ హాలీడే సండే నాడు హైదరాబాద్ నుంచి ఐటీ ఉద్యోగులు పోటెత్తారు. ఇప్పటికే ఏపీలో నిరుద్యోగులు, ఉద్యోగులు జగన్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పక్కరాష్ట్రం తెలంగాణ నుంచి ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు రావడం నిజంగా జగన్ కు మైనస్ గా చెప్పకతప్పదు. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో జగన్ పై గూడుకట్టుకున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనంగా కనిపిస్తోంది. ఒక మాజీ సీఎం కోసం.. మరో ప్రస్తుత సీఎంపై తిరుగుబాటుకు ఐటీ ఉద్యోగులు వస్తున్నారంటే అది ఖచ్చితంగా యువతలో జగన్ పై ఉన్న వ్యతిరేకతను సూచిస్తోంది.*

చంద్రబాబు అరెస్ట్ పై ఐటి ప్రొఫెసనల్స్ పలు రూపాల్లో ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు నాటి నుంచే హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఐటి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాదులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బాహటంగానే ముందుకు వచ్చి నిరసనలు తెలిపారు. వైసీపీ సర్కార్ ఒత్తిడితో ఐటీ యాజమాన్యాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ పట్టించుకోని ఐటి ప్రొఫెషనల్స్ హైదరాబాదు నుంచి రాజమండ్రి కి ప్రత్యేక కార్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ర్యాలీ నిర్వహిస్తే కేసులు నమోదు తప్పవని హెచ్చరించారు.

హైదరాబాదు నుండి కార్ల ర్యాలీతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని ఐటీ ప్రొఫెషనల్స్ నిర్ణయించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్లను ఏర్పాటు చేసివారిని అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దాదాపు అన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. మూడంచెల్లో దాదాపు 250 మంది పోలీస్ సిబ్బంది తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు బృందాలుగా విడిపోయి.. ఇప్పటికే ఏపీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ఖమ్మం మీదుగా రాజమండ్రి వెళ్తున్నట్లు సమాచారం. ఏపీ పోలీసులు కట్టడి చేస్తారన్న ఉద్దేశంతో కొంతమంది ఐటీ ఉద్యోగులు ముందుగానే రాజమండ్రి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో భారీగా కార్ల ర్యాలీ నిర్వహించి చంద్రబాబుకు మద్దతు తెలపాలని ఐటి ఉద్యోగులు గట్టి ప్రయత్నంతో ఉన్నారు. పోలీసులు కేసులు నమోదు చేసిన పర్వాలేదన్న కోణంలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. తామంతా ఐటీ ప్రొఫెషనల్స్ అని.. పోలీస్ కేసులైనా ఉద్యోగాలకు వచ్చే ఢోకా లేదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులు సైతం అదే పట్టుదలతో ఉన్నారు. ఐటీ ఉద్యోగుల చలో రాజమండ్రిని భగ్నం చేసేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

నిర్బంధం ఎప్పుడూ ఒక లిమిట్ వరకూ ఉంటే ఈ వ్యతిరేకత వచ్చేది కాదు. స్కిల్ డెవలప్ మెంట్ వరకే జగన్ పరిమితమైతే ఈ వ్యతిరేకత ప్రజల్లో ఉద్యోగుల్లో వచ్చేది కాదు. కానీ చంద్రబాబును బయటకు రాకుండా వరుస కేసులతో జగన్ లోపల వేయడంతో లైఫ్ నిచ్చి తమకు ఇంత చేసిన చంద్రబాబు కోసం ఐటీ ఉద్యోగులు కదిలి వచ్చారు. రేపు ప్రజలు ఇలానే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతిమంగా ఇది జగన్ సర్కార్ పై తిరుగుబాటుకు దారితీయవచ్చు. సర్కార్ నే కూల్చవచ్చన్న చర్చ సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version