Nagababu: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబుకు మంచి పదవి దక్కుతుందని అంతా భావించారు. టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఆయనకేనని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ నాగబాబుకు పెద్దల సభకు వెళ్లాలని ఉండడంతో సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే తాజాగా ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో.. ఒకటి నాగబాబుకు ఖాయమని ప్రచారం నడిచింది. కానీ చివరి నిమిషంలో పరిణామాలు మారాయి. నాగబాబు కు ఛాన్స్ లేకుండా పోయింది. అయితే అనూహ్యంగా చంద్రబాబు తన క్యాబినెట్ లోకి నాగబాబును తీసుకోనున్నట్లు ప్రకటించారు. దీనిపై కూటమిలో సైతం భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం పవన్ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. నాగబాబు మంత్రి పదవి పై చర్చించనున్నారు. పనిలో పనిగా నామినేటెడ్ పదవులపై సైతం వారిద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పదవులపై పూర్తి స్పష్టతకు వస్తారని తెలుస్తోంది.
* ఆ రెండు శాఖలు
అయితే నాగబాబు మంత్రి పదవికి సంబంధించి కూటమి పార్టీల్లో ఒక సానుకూలత వచ్చింది. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయిగా మారింది. అయితే ఆయన శాఖలపై విస్తృత చర్చ నడుస్తోంది. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అన్నది హాట్ టాపిక్ అవుతోంది. తొలుత ఎక్సైజ్, గనుల శాఖ ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే ఆ రెండు శాఖలు కొల్లు రవీంద్ర వద్ద ఉన్నాయి. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో.. ఆయన నుంచి శాఖలు తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని తగ్గినట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాగబాబుకు సినిమాటోగ్రఫీ తో పాటు పర్యాటక శాఖ ఇస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఆ శాఖలు కందుల దుర్గేష్ వద్ద ఉన్నాయి. ఆయన జనసేనకు చెందిన నేత కావడంతో.. ఆ శాఖలు తీసుకునేందుకు సులువు. అయితే దానికి బదులు పవన్ తన వద్ద ఉన్న రెండు శాఖలను వదులుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం.
* త్వరలో ఎమ్మెల్సీగా ఎంపిక
ప్రస్తుతం నాగబాబు ఏ సభల్లోనూ సభ్యుడు కాదు. ఎమ్మెల్సీగా ఆయనను ఎంపిక చేయాల్సి ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. ప్రస్తుతం ఓ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అవి మండలి చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. మార్చిలో చాలామంది ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. చాలా ఖాళీలవుతాయి. అందులో ఒక పదవి నాగబాబుకు ఇవ్వనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సైతం ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అటు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా పవన్ చంద్రబాబుతో చర్చించుకున్నారు. దీంతో వీరి భేటీకి ఎంతో ప్రాధాన్యత ఉంది.