Chandrababu – Swati Chaudhary : ఈ మధ్యన సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతోంది. శృతిమించి వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుంటూ ఆడుతున్న వికృత క్రీడలో నేతల కుటుంబాలు చిక్కుకుంటున్నాయి. అన్నింటికంటే మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరం. అయితే దీనిని బాధ్యతగా ఖండించాల్సిన నేతలు ప్రోత్సహించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఇప్పుడు చేయూతనందిస్తున్న వారే బాధితులు కావడం ఖాయం. అంతలా సోషల్ మీడియా స్వేచ్ఛ కట్టలు తెంచుకుంటున్నసమయమిది. అందునా దేశ విదేశాల నుంచి సోషల్ మీడియా పోస్టులు పెడుతుండడంతో ఇదో అంతర్జాతీయ సమస్యగా మారిపోయింది.
ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతీరెడ్డి అనే యువతి లండన్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వచ్చింది. దానికి విరుగుడుగా వైసీపీ సోషల్ మీడియా తొలుత ఆమె రెడ్డియేనా అని వాకబు చేసే ప్రయత్నం చేసింది. తరువాత ఆమెను టార్గెట్ చేసుకొని చేసిన ప్రచారంతో ఆమె కన్నీరుపెట్టుకుంది. ఏకంగా జగన్ తో పాటు సతీమణి భారతిని తిట్టిపోసింది. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది. కానీ ఒకటి మాత్రం నిజం. ఇది సోషల్ మీడియా వార్ వ్యవహారం. ప్రజలు అల్లరిచిల్లరిగా భావించే యవ్వారం. ఇటువంటి వాటిలో చంద్రబాబులాంటి నేత ఎంటర్ కావడం విచారకరం. ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడే వారి నోరు నొక్కుతారా అంటూ.. లండన్ లో ఉన్న స్వాతీరెడ్డికి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ధైర్యం చెప్పారు.
ఐఎస్బీలో చదువుకున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దానిపై ప్రచారం కంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వారినే ఆయన ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా టీడీపీ తరుపున యాక్టివ్ గా ఉండే వారిని బయటకు లాగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక సోషల్ మీడియాపై ఫోకస్ పెంచారు. మార్ఫింగ్ లతో పోస్టులు పెడుతున్నారు. వీటిపై లండన్ లో ఉన్న స్వాతీరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. రాజమండ్రికి చెందిన అనూష పోలీసులకు ఫిర్యాదుచేశారు. మణిరత్నం అనే యువకుడు వైసీపీ సోషల్ మీడియా తనను వెంటాడుతోందని అదే సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే ఒకటి మాత్రం నిజం. సోషల్ మీడియా మాటున పోకిరీ చేష్టలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. అవి ఎదుటి వ్యక్తులను చికాకు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా నేతలు, ప్రజాప్రతినిధుల తీరుపై వ్యతిరేకత, వారి పాలన విధానాలపై విమర్శలు చేయవచ్చును. కానీ సోషల్ మీడియా పోకిరీ చేష్టలు అంతటి ఆగడం లేదు. నేతల కుటుంబసభ్యులు, మహిళల జోలికి వెళుతున్నారు. లండన్ కు చెందిన సునీతారెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఆమె ఏకంగా సీఎం సతీమణి భారతి గురించి ప్రస్తావించారు. అయితే ఇటువంటి విషయాల్లో చంద్రబాబు ఒకటికి రెండుసార్లు జాగ్రత్త తీసుకొని స్పందించి ఉంటే సరిపోయేది. మహిళలను కించపరిచే విషయంలో ఆయనా బాధితుడే. అందుకే చంద్రబాబు స్పందించేసరికి కాస్తా భిన్నమైన కామెంట్స్ ను ఎదుర్కొంటున్నారు. మహిళలంటే మన ఇంట్లో వారేనా.. ఎదుటి వారి ఇంట్లో ఉంటారని..వారికి కూడా ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.