Sathya Sai Jayanti: పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా గురించి గొప్ప వ్యాఖ్యలు చేశారు.
* అపర భగీరధుడు : సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు బాబాతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ సమయంలో నన్ను బంగారం అని పిలిచి.. ఈ ప్రాంతంలో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నానని.. దాని నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వపరంగా తీసుకోవాలని కోరారని.. దానికి తాను సమ్మతించినట్లు గుర్తు చేశారు చంద్రబాబు. మనిషి రూపంలో ఉన్న దైవ స్వరూపం సత్యసాయిబాబా గా అభివర్ణించారు. ప్రపంచమంతా ప్రేమను పంచారని.. విదేశాలకు వెళ్లిన ఆయన గొప్పతనాన్ని అక్కడి ప్రజలు గుర్తు చేస్తారని చెప్పారు. 1600 గ్రామాల్లో 30 లక్షల మంది జనాభా కు తాగునీరు అందించారు. 102 విద్యాలయాలను నెలకొల్పారు. ఎన్నో వైద్యాలయాలను స్థాపించారు. 140 దేశాల్లో 200 కేంద్రాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. ఆయన ప్రేమ సిద్ధాంతాన్ని అందరూ అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సత్య సాయి చూపిన మార్గంలో ముందుకెళ్లాలని అన్నారు చంద్రబాబు
* బాల్యం నుంచి అనుబంధం : సచిన్
సత్యసాయిబాబా తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. బాల్యం నుంచే తనకు బాబాతో పరోక్ష అనుబంధంగా ఉందని గుర్తు చేశారు. బాల్యంలో తన జుట్టు బాబాతో పోలి ఉండేదని.. ఈ విషయాన్ని పలుమార్లు స్నేహితులు చెప్పేసరికి అలానే కొనసాగించాలని చెప్పారు. 90వ దశకంలో బాబాను కలిసిన విషయాన్ని ప్రస్తావించారు సచిన్ టెండూల్కర్. అప్పట్లో తనలో ఉన్న భావాలను కూడా ఆయనే చెప్పేసారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే సత్యసాయి లక్ష్యంగా పెట్టుకునే వారని.. వారి ఉన్నతికి కృషి చేశారని కొనియాడారు. 2011 వరల్డ్ కప్ లో నేను ఆడినప్పుడు భావోద్వేగాలు అధికంగా ఉండేవి. బెంగళూరులో ఉన్న సమయంలో సత్యసాయి బాబా ఫోన్ చేశారని.. అనంతరం ఒక పుస్తకం పంపారని.. అది నాకు సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పారు సచిన్ టెండూల్కర్. అదే సంవత్సరం ట్రోఫీ కూడా గెలుచుకున్నామని.. అది నాకు గోల్డెన్ మూమెంట్ అని గుర్తు చేసుకున్నారు.