Chandrababu And Pawan Bihar: దేశంలో విచిత్ర రాజకీయ పరిస్థితి నడుస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi). అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి రాజకీయంగా పోరాటం చేస్తోంది. చిన్న అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా బిహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే అక్కడ చెమటోడ్చుతుంది ఎన్డీఏ. అక్కడ గెలుపు ఏమంత సులువు కాదు కూడా. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టి సవాల్ విసురుతోంది. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ ఎన్నికల వరకు ఒక ఎత్తు. దాని ఫలితాలు మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలు తక్కువ. అదే ఇండియా కూటమిలో అయితే జాతీయస్థాయిలో చాలామంది నేతలు ఉన్నారు. ఇండియా కూటమి తరుపున ప్రచారం చేసేందుకు చాలామంది నేతలు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ గట్టి వ్యూహాలు రూపొందిస్తున్నారు.
* ఇద్దరికీ ఇమేజ్
జాతీయస్థాయిలో చంద్రబాబుతో( CM Chandrababu) పాటు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఇమేజ్ ఉంది. కొన్ని దశాబ్దాలుగా కేంద్ర రాజకీయాల్లో సుపరిచితుడు చంద్రబాబు. ఆపై మంచి పాలనా దక్షుడు అన్న పేరు తెచ్చుకున్నారు. జాతీయస్థాయిలో మంచి ఇమేజ్ ఉంది. అందుకే బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని చంద్రబాబును బిజెపి పెద్దలతో పాటు నితీష్ కుమార్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీలో ప్రచారం చేశారు చంద్రబాబు. అక్కడ తెలుగువారితో పాటు జాతీయస్థాయిలో చంద్రబాబు ప్రభావం చూపడంతో ఎన్డీఏ గెలుపులో భాగస్వామ్యం అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మరణంతో తిరిగి వచ్చేసారు. ఇప్పుడు బీహార్ ప్రచారానికి వెళ్తున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు.
* ప్రత్యేక ఆకర్షణగా పవన్..
పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan ) సైతం బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు. సనాతన ధర్మం, హిందూ పరిరక్షణ విషయంలో పవన్ చర్యలను జాతీయస్థాయిలో హిందూ వాదులు గట్టిగానే సమర్థించారు. బీహార్లో సైతం పవన్ ప్రచారం చేస్తే హిందువులు గుంప గుత్తిగా ఎన్డీఏకు ఓటు వేస్తారని బిజెపి పెద్దల ఆలోచన. అయితే బిజెపి విషయంలో పవన్ ఎప్పుడు సానుకూలంగానే ఉంటారు. తప్పకుండా బిజెపి వినతిని పరిగణలోకి తీసుకొని బీహార్ ప్రచారంలోకి వెళ్తారు పవన్ కళ్యాణ్. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బిజీగా ఉంది. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. దానికి ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు తో పాటు మంత్రులు తరచూ విదేశాలకు వెళ్తున్నారు. వచ్చే నెల విశాఖ సదస్సు జరగనున్న దృష్ట్యా బిజీ గా ఉన్న తరుణంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశం ఉంది. దీనిపై అధికారిక షెడ్యూల్ రావాల్సి ఉంది.