Chandrababu: పవన్ హెలికాప్టర్ ను అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు అడ్డుకున్నారు? కొద్దిరోజుల కిందట పవన్ సభల్లో బ్లేడ్ బ్యాచులు హల్చల్ చేశాయని స్వయంగా ఆయనే ఆరోపించారు. ఇప్పుడు పవన్ హెలికాప్టర్లకు సంబంధించి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించడం విశేషం. టిడిపి, జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. అందుకే తమ పర్యటనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితేపవన్ హెలిక్యాప్టర్ ను అడ్డుకున్నారని ఆయన చెప్పకపోగా.. చంద్రబాబు బయట పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగిందని ఎక్కువమంది ఆరా తీయడం కనిపించింది.
గత రెండు రోజులుగా చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.వరుసగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఉమ్మడి వేదికలలో చంద్రబాబుతో పాటు పవన్ ప్రసంగిస్తున్నారు.అంబాజీపేట, అమలాపురం సభలకు హాజరయ్యేందుకు పవన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్ లో వెళ్లారు. అయితే ఆ హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అడ్డు తగిలారు. హెలికాప్టర్ నడపడానికి వచ్చిన కో పైలట్ కి ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్ లేదని చెబుతూ బయట ఆపేశారు. దీంతో చంద్రబాబు హెలికాప్టర్ కో పైలట్ వెళ్లడంతో అక్కడ్నుంచి పవన్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇందులో కుట్ర ఉందన్నది చంద్రబాబు ఆరోపణ. అదే కో పైలట్ కు బేగంపేట ఎయిర్ పోర్ట్ లో తాత్కాలికంగా అనుమతి ఇచ్చారని.. మరి రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఎందుకు అడ్డగించారు అన్నది చంద్రబాబు ప్రశ్న. అక్కడ లేని నిబంధనలు ఇక్కడ ఎందుకు వచ్చాయని చంద్రబాబు నిలదీశారు.
గతంలో కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ విషయంలో ఆర్ అండ్ బి అధికారులు అడ్డు తగిలారు. ఆయన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తీవ్ర జాప్యం చేశారు. సొంత నియోజకవర్గ భీమవరం నియోజకవర్గ పర్యటన విషయంలో ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలకు అడ్డు తగిలేందుకు నిబంధనలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను పిఠాపురంలో ప్రత్యేక హెలిపాడ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ పైలెట్లు, కో పైలెట్ల విషయంలో అనవసర నిబంధనలు తెరపైకి తెచ్చి.. పవన్ పర్యటన షెడ్యూల్లో అవాంతరాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి వైసిపి చేస్తున్న పని అని.. కూటమి అంటేనే వైసిపి భయపడుతోందని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పేదాకా ఈ విషయం బయటకు తెలియక పోవడం విశేషం.