Chandrababu: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి( Kotamreddy Sridhar Reddy ) కూటమి ప్రభుత్వంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు కోటంరెడ్డి. ఆయన అడిగిందే తడువు కూటమి ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను మంజూరు చేస్తోంది. గడిచిన పది నెలల్లో నియోజకవర్గంలో 399 పనులకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. వాస్తవానికి అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులు అడిగితే వివక్ష చూపారని.. అన్నింటికీ సంక్షేమ పథకాలతో ముడి పెట్టడంతోనే.. కోటంరెడ్డి ఆరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఒకేసారి రికార్డ్ స్థాయిలో 399 పనులు పూర్తి చేయగలిగారు. మే 15న ఆయా ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ ను కలిశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Also Read: కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం!
* మాస్ ఫాలోయింగ్ లీడర్..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. ఆ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికల్లో సైతం సూపర్ విక్టరీ సాధించారు. జగన్ మంత్రివర్గంలో పదవి ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పదవి కేటాయించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నిర్లక్ష్యానికి గురయ్యారు శ్రీధర్ రెడ్డి. ఇతర నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం తనకు దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు శ్రీధర్ రెడ్డి. క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. వైసిపి హయాంలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ అభ్యర్థికి కాకుండా ప్రత్యర్థికి ఓటు వేశారని కారణం చూపుతూ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి ఆశించారు కానీ దక్కలేదు. కానీ టిడిపిలో సరైన గౌరవం లభిస్తోంది. ఆపై అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.
* నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అభివృద్ధి పనులపై చక్కటి ప్రణాళిక వేసుకున్నారు. ఉపాధి హామీ, పల్లె పండుగ, ఇతరత్రా నిధులతో 399 పనులను ప్రారంభించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లి మరి పరిశీలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 399 పనులు పూర్తయ్యాయి. వాటి ప్రారంభోత్సవం ఈనెల 15న జరగనుంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును కలిశారు శ్రీధర్ రెడ్డి. అభివృద్ధి పనులకు సంబంధించి బుక్లెట్ అందించారు. దానిని చూసిన చంద్రబాబు అభినందనలతో ముంచెత్తారు.
* మంత్రి పదవి ఆశించి..
వాస్తవానికి టిడిపి( TDP) ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు కోటంరెడ్డి. కానీ ఆయనతో పాటు టీడీపీలో చేరిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి అవకాశం కలిగింది. అయినా సరే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్తికి గురికాలేదు. ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పనితీరును గుర్తించిన చంద్రబాబు తప్పకుండా భవిష్యత్తులో.. మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: విజయవాడ టు విశాఖ.. జూన్ 1 నుంచి విమాన సేవలు!