Chandrababu: ఎన్నికల ముంగిట టిడిపి అధినేత చంద్రబాబు అన్ని విఘ్నాలను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నేటి నుంచి ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉండవల్లిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించనున్నారు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఇప్పుడు యాగాలు చేయడానికి సిద్ధపడుతున్నారు.
సరిగ్గా ఏపీ సీఎం జగన్ గత ఎన్నికల ముందు ఇటువంటి యాగాలే చేపట్టారు. విశాఖకు చెందిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జగన్ పూజలు చేశారు. చాలాసార్లు విశాఖ శారదా పీఠానికి వెళ్లారు. స్వామీజీ స్వయంగా పూజలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు తగ్గించినా.. వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ శారదా పీఠానికి క్యూ కడుతుంటారు. అయితే జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు పూజలు తక్కువే. స్వామీజీలను వెంపర్లాడడం కూడా తక్కువే. అయితే సుదీర్ఘకాలం జైలు జీవితం అనుభవించి బయటికి వచ్చిన చంద్రబాబు మాత్రం.. ఎన్నడూ లేని విధంగా ఆలయాలను సందర్శించడం… ఇప్పుడు యాగాలు చేయడానికి సిద్ధమవుతుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట పై ఉన్న నివాసంలో చంద్రబాబు ఈరోజు నుంచి మూడు రోజులు పాటు జరిగే యాగాలు పూజల్లో పాల్గొంటారు. ఇందులో శత చండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీయాగం, సుదర్శన నరసింహ హోమం తో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొనే ఈ యాగాలు కోసం ఉండవల్లి నివాసంలో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు, పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ మూడు రోజుల పాటు తన అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలని లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎప్పటికీ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి కోసం ఎదురుచూస్తున్నారు. కాషాయ పార్టీ రాకున్నా.. కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ ను కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. తన అరెస్టు తరువాత మారిన రాజకీయ పరిస్థితులు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు సిద్ధపడుతున్నారు. ఇంతలో యాగాలు, పూజలు పూర్తిచేయాలనుకోవడం విశేషం.