AP Tourism Development: పర్యాటకంగానూ ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది కేంద్రం. ఇప్పటికే విభజన హామీల్లో భాగంగా ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రానికి ప్రధాన ప్రాజెక్టులను కేటాయిస్తోంది. పెద్ద ఎత్తున నిధులను కూడా కేటాయిస్తోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధికి నడుం బిగించింది. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చాలా నగరాలను ఎంపిక చేసింది. అందులో తిరుపతి, విశాఖ నగరాలు ఉండడం విశేషం. సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేసే విషయాన్ని పరిశీలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో నగరంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధికి.. కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల చొప్పున అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది.
ఆదాయం తో పాటు ఉద్యోగ అవకాశాలు..
దేశవ్యాప్తంగా పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఆదాయంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. మొత్తం పర్యాటక రంగాన్ని మిషన్ మోడ్ లో అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రణాళికగా తెలుస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. కేవలం మన దేశ పర్యటకులకు ఆకట్టుకోవడమే కాదు విదేశీ పర్యాటకులను రప్పించేందుకు వీలుగా.. సరికొత్త నిర్మాణాలు జరపాలన్నది ఆలోచన. అందులో భాగంగా తిరుపతి తో పాటు విశాఖ నగరంలో పర్యాటక సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. తిరుపతిలో ఓ 60 ఎకరాల వరకు.. విశాఖలో ఓ 50 ఎకరాల వరకు ఖాళీ భూమిని అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు.
గోవా ఫార్ములాతో..
దేశంలో ఇప్పుడు గోవా అనేది పర్యాటక ప్రాంతం. అక్కడి పర్యాటక రోడ్డు మ్యాప్ లో పేర్కొన్న ఐదు కీలక అంశాలైన గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాతక ఎం ఎస్ ఎం ఈ లు, డెస్టినేషన్ మేనేజ్మెంట్లకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఆ జాబితాలో విశాఖ తో పాటు తిరుపతి నగరాలు ఉండడం విశేషం. పర్యాటక అభివృద్ధిలో స్థానికులను సైతం ఈ ప్రాజెక్టులో భాగంగా భాగస్వామ్యం చేస్తారు, స్థానిక అవసరాలు, ఆశయాలు, సాంస్కృతిక విలువలు దృష్టిలో పెట్టుకొని ఈ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఒక ప్రణాళిక, వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. అదే జరిగితే పర్యాటక రంగంలో దేశంలో ఏపీ కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించే అవకాశం ఉంది.
