Amaravati: అమరావతికి గుడ్ న్యూస్.. గొప్ప వరం ఇచ్చిన కేంద్రం

2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని ఎంపిక చేసి పనులను ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే. నాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని మోదీ ఎటువంటి నిధులు ప్రకటించలేదు. ప్రత్యేక హోదా అంశంతో చాలా రోజులు పాటు ఊగిసలాట జరిగింది. నిధుల కేటాయింపు విషయంలో జాప్యం జరిగింది.

Written By: Dharma, Updated On : July 10, 2024 10:38 am

Amaravati

Follow us on

Amaravati: అమరావతి : అమరావతికి శుభవార్త చెప్పింది కేంద్రం.రాజధాని అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా నిలవనుంది.కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకు సిద్ధపడింది. ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించనుంది. ముఖ్యంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ ఆరు లైన్లతో ఈ రహదారి నిర్మాణం జరగనుంది. ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 189 కిలోమీటర్లకు గాను 25 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ బడ్జెట్లో ఐదు నుంచి పదివేల కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

2014లో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని ఎంపిక చేసి పనులను ప్రారంభించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ సహకారం అంతంత మాత్రమే. నాడు అమరావతి రాజధాని శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని మోదీ ఎటువంటి నిధులు ప్రకటించలేదు. ప్రత్యేక హోదా అంశంతో చాలా రోజులు పాటు ఊగిసలాట జరిగింది. నిధుల కేటాయింపు విషయంలో జాప్యం జరిగింది. ఆ ప్రభావం అమరావతి నిర్మాణ పనుల పై పడింది.2017 నుంచి అమరావతి పనులు ప్రారంభించాల్సి వచ్చింది. 2019 ఎన్నికల నాటికి కొన్ని రకాల పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణం ప్రారంభం కాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రతిపాదిత నవ నగరాలను కలుపుతూ సరైన రోడ్డు లేదు. అప్పట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు చంద్రబాబు.

అమరావతి రాజధానిలో తొమ్మిది నగరాలు నిర్మించాలన్నది లక్ష్యం. ఇందుకుగాను దాదాపు 53 వేల ఎకరాలను సమీకరించారు. అయితే ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాలను కలుపుతూ..ఇతర రహదారులను అనుసంధానిస్తూ 189 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆరు లైన్ల రహదారి నిర్మాణం చేపడితే.. ట్రాఫిక్ సమస్యతో పాటు నవ నగరాలకు రవాణా మరింత సుగమం అవుతుంది. నగరీకరణ రూపు వస్తుంది. ఈ కీలక నిర్మాణాన్ని తామే చేపడతామని కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే చంద్రబాబు విన్నపం మేరకు అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు ఈ బడ్జెట్లో పదివేల కోట్ల రూపాయల వరకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ సేకరణకు సైతం కేంద్ర నిధులు కేటాయిస్తుండడం విశేషం.