Amaravati capital city: అమరావతి రాజధాని లో( Amaravati capital ) కీలక పరిణామం. 25 ప్రధాన బ్యాంకులతోపాటు బ్యాంకు రంగ కార్యాలయాలకు సంబంధించిన భవన నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, నారాయణ పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు అవుతున్నాయి. నిజంగా అమరావతి రాజధానికి ఇదో మణిహారమే. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణమే జరుగుతోంది. మరోవైపు ప్రైవేట్ సంస్థలతోపాటు విద్యాసంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే కీలకమైన కేంద్ర ఆర్థిక రంగానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభం కావడం శుభపరిణామం. రెండేళ్లలో ఈ నిర్మాణాలన్నీ అందుబాటులోకి రానున్నాయి.
అన్ని కార్యాలయాలు ఒకే చోట..
రిజర్వ్ బ్యాంకు( Reserve Bank) ప్రాంతీయ కార్యాలయ భవనంతో పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి ప్రధాన కార్యాలయాలు ఇక్కడ నిర్మితం కానున్నాయి. సాధారణంగా రాజధానిలోనే ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి. కానీ ఏ రాజధానికి దక్కని అరుదైన గౌరవం అమరావతికి దక్కింది. ఒకే చోట ప్రాంతీయ బ్యాంకు కార్యాలయాలన్నీ అందుబాటులోకి రావడంతో.. అమరావతి ఒక ప్రాంతం ఆర్థిక హబ్ గా మారనుంది. హైదరాబాద్ నే తీసుకుందాం వేర్వేరు ప్రాంతంలో బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. కానీ అమరావతిలో మాత్రం ఒకే చోట దర్శనం ఇవ్వనున్నాయి. పైగా అత్యాధునికంగా, ఆకర్షనీయంగా ఈ భవనాల నిర్మాణం జరగనుంది. సీడ్ యాక్సిస్ రోడ్ లో.. సి ఆర్ టి ఏ కార్యాలయ భవనం బ్లాక్ లోనే వీటి నిర్మాణం జరుగుతోంది. రెండేళ్లలో పూర్తిస్థాయిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కేంద్రం ప్రాధాన్యం..
కేంద్ర ఆర్థిక రంగ సంస్థలతో పాటు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణం జరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతికి ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15 వేల కోట్లు కేటాయించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులను సర్దుబాటు చేసింది. అయితే ఇది అప్పు రూపంలో మాత్రమేనని.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అదే సమయంలో అమరావతి విషయంలో విషప్రచారం జరిగింది. వరద ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తున్నారని కొత్త తరహా ప్రచారం ప్రారంభం అయింది. అయితే వాటన్నింటికీ చెక్ చెబుతూ కేంద్ర ప్రభుత్వ సహకారం సైతం అమరావతికి ఉందని చాటి చెప్పేలా.. బ్యాంకు కార్యాలయాల నిర్మాణం జరగనుండడం విశేషం. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు బలమే. అమరావతి విషయంలో ఇకనుంచి కేంద్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణ కూడా ఉండనుంది.