AP Capitals idea: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ కొంచెం అతి చేసింది. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. తద్వారా మూడు ప్రాంతాల ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోవాలని చూసింది. అయితే అది ప్రకటనల వరకి పరిమితం అయింది. కార్యరూపం దాల్చకపోయేసరికి ఆ ప్రాంతీయులు నమ్మలేదు. మూడు ప్రాంతాల ప్రజలు తిరస్కరించారు. దాని ప్రభావమే 2024 ఎన్నికల ఫలితాలు. అంతటి ఘోర అపజయానికి కారణం ముమ్మాటికి రాజధానుల అంశమే. తమ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తామని చెప్పారు. కానీ అక్కడి ప్రజలు స్వాగతించక పోగా వ్యతిరేకించారు. పాలనా రాజధాని కడతానన్న విశాఖలో ప్రజలు వ్యతిరేకించారు. అమరావతిని నిర్వీర్యం చేశారన్న ఆందోళనతో చుట్టుపక్కల జిల్లాల ప్రజలు దారుణంగా ఓడించారు. న్యాయ రాజధానిగా ప్రకటించిన కర్నూలు ప్రాంత ప్రజలు కూడా తిరస్కరించారు. ఆ మూడు చోట్ల ఏ వర్గానికి కూడా దగ్గర కాలేదు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
నయా ఫార్ములా తో కూటమి..
అయితే ఇప్పుడు కూటమి ఒక నయా ఫార్ములా తో ముందుకు సాగుతోంది. అమరావతిని( Amaravati capital ) ఏకైక రాజధాని చేసింది. మేటి నగరంగా అమరావతిని తీర్చిదిద్దనుంది. ఆపై విశాఖకు ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. భారీగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించింది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖ రానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటు అవుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. విశాఖ ఐటీ హబ్ గా మారనుంది. మరో రెండు రోజుల్లో పెట్టుబడుల సదస్సు కూడా జరగనుంది. దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా ఉంది.
నమ్మని విశాఖ ప్రజలు..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన రాజధానిగా విశాఖను మార్చాలని చూసింది. అయితే రాజధానిగా ప్రకటించింది కానీ అభివృద్ధికి చిరునామాగా మార్చలేదు. రాజధానితో ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని వైసిపి చెప్పుకొచ్చింది. కానీ ప్రజలు మాత్రం నమ్మలేదు. రాజధాని కంటే ఈ ప్రాంత అభివృద్ధిని ఎక్కువగా ఆకాంక్షించారు. దానిని గుర్తించింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. విశాఖను పాలనా రాజధానిగా కంటే ఆర్థిక రాజధానిగా మార్చేందుకు కంకణం కట్టుకుంది. సహజంగానే ఈ ప్రక్రియ విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్రవాసులకు నచ్చింది. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత కనిపిస్తోంది ఆ ప్రాంతంలో. నేరుగా రాజధాని చేస్తామని చెప్పిన నాడు అక్కడి ప్రజలు విశ్వసించలేదు. కానీ ఏకంగా ఆర్థికంగా పెట్టుబడులు కనిపిస్తుంటే మాత్రం ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతోంది.
ఐదు జిల్లాల ప్రజల ఆనందం..
అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడంతో చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా తమను నిర్లక్ష్యం చేస్తే.. తమ ఆశలను చంపేస్తే.. ఏ తీరిన ఆ ప్రజలు ఉంటారో తెలియనిది కాదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పరుగులు పెట్టింది. ప్రజలు ఆనందించారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపై రాయలసీమలో భారీగా పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయించారు. మొత్తానికి అయితే మూడు రాజధానులను వద్దన్న ప్రజలు.. అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించారు చంద్రబాబు. నిజంగా ఈ విషయంలో ఆయనకు సెల్యూట్ చెప్పాల్సిందే.