Ambati Rambabu U-turn: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబుతో పాటు పవన్ పై ఓ స్థాయిలో విరుచుకుపడతారు. లోకేష్ విషయంలో చెప్పనవసరం లేదు. రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ.. దానికి తన కుక్క కూడా భయపడదని చెప్పుకొచ్చేవారు. అంతటితో ఆగకుండా వ్యక్తిగత విమర్శలకు సైతం దిగేవారు. అటువంటి అంబటి తిరుమల సాక్షిగా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్లో టీటీడీకి అనుకూలంగా మాట్లాడారు. అభినందనలతో ముంచెత్తారు. అయితే ఇలా అంబటి అభినందనలు సాక్షి మీడియాలో రాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు ఎప్పటికీ ఇప్పుడు ఇలా మారిపోవడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఆశించి అలా చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకం జరుగుతున్న పరిస్థితుల్లో అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అనుకోని అవకాశం..
అప్పుడెప్పుడో 1989 ఎన్నికల్లో గెలిచారు అంబటి రాంబాబు. అది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో యాక్టివ్ అయ్యారు. పార్టీలో తన వాయిస్ను పెంచుకున్నారు. ఆ పార్టీ తరపున మూడుసార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే వైసిపి హయాంలో అత్యంత వివాదాస్పద మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుకు టిక్కెట్ ఇవ్వరని.. పార్టీ కోసం ఆయనను ఉపయోగించుకుంటారని ప్రచారం జరుగుతోంది. నరసరావుపేట నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అంబటి రాంబాబును.. గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఇన్చార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేటలో ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. అయినా సరే అంబటి రాంబాబు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ డిసెంబర్ లోగా నియోజకవర్గ ఇన్చార్జిల నియామకాన్ని పూర్తిచేసి.. ప్రజల్లోకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
నరసరావుపేట కోసమే..
ఇటీవల చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను నియమిస్తున్నారు. కానీ తన గురించి తేల్చకపోయేసరికి అంబటి రాంబాబులో( ambati Rambabu) ఒక రకమైన అసహనం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల తిరుమల కుటుంబ సమేతంగా వెళ్లారు అంబటి. తిరుమలలో ఉండే అన్న సత్రంలో భోజనం చేశారు. శుచి, శుభ్రత ఉండడంతో టీటీడీని అభినందించారు. అంతటితో ఆగకుండా తన సోషల్ మీడియాలో అభినందనలు కూడా తెలిపారు. ప్రస్తుతం టీటీడీపై టిడిపి కూటమితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వాదనలు చేస్తోంది. టీటీడీ పూర్వపు అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అయితే తిరుమల లో అపవిత్ర చర్యలు చేపడుతున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు లడ్డు వివాదం పై విచారణ కొనసాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే టీటీడీకి అభినందనలు తెలుపుతూ అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇబ్బందికరంగా మారింది. అయితే ఇదంతా నరసరావుపేట ఇన్చార్జి పదవి కోసమేనని ప్రచారం నడుస్తోంది. మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాలి.