Cabinet Meeting : కాకినాడ పోర్టులో అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన తర్వాత కాకినాడ పోర్టు వార్తల్లో నిలిచింది. అక్కడ అడ్డగోలుగా వ్యవహారాలు నడుస్తున్నట్లు బయటపడింది.సౌత్ ఆఫ్రికా కు వేల టన్నుల బియ్యంతో వెళుతున్న షిప్ పట్టుబడిన సంగతి తెలిసిందే.దీంతో రేషన్ దందా తగ్గలేదని స్పష్టమైంది. అందుకే కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న సీఎం చంద్రబాబును కలిసిన పవన్ కాకినాడ పోర్టులో జరుగుతున్న దందా విషయమై మాట్లాడారు. పూర్తిగా నివేదించారు. కొద్దిరోజుల కిందట కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ సముద్రంలోకి వెళ్లి మరి ఆ షిప్ ను అదుపులోకి తీసుకున్నారు.అటు తరువాత పవన్ పరిశీలించి కాకినాడ పోర్టులో జరుగుతున్న దందాపై తీవ్ర విమర్శలు చేశారు. పోర్టు భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. సిబిఐతో కానీ, సిఐడి తో కానీ విచారణ చేయిస్తామని చెప్పారు. ఈ తరుణంలోనే చంద్రబాబుతో ఈ విషయమై సీరియస్ గా చర్చించినట్లు తెలుస్తోంది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* మల్లగుల్లాలు
వైసిపి హయాంలో కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం తరలింపు పై తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టుబడిన ఓ విదేశీ షిప్ ను సీజ్ చేయలేని పరిస్థితుల్లో ఉండడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అందుకే దీనిని జాతీయ అంశం గా పరిగణించి సిబిఐతో దర్యాప్తు చేయిస్తే మేలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే మంత్రివర్గ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ లేఖ రాశారు. కేంద్ర ఆదేశాల మేరకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* వైసీపీ ఎదురుదాడి
మరోవైపు కాకినాడ బియ్యం వ్యవహారంపై వైసిపి ఆత్మరక్షణలో పడింది. పవన్ ముప్పేట దాడి చేస్తుండడంతో ఇప్పుడు కౌంటర్ అటాక్ చేయడం ప్రారంభించింది. ఇందులో టిడిపి నేతల హస్తం కూడా ఉందని చెబుతోంది. ఇటీవల పేర్ని నాని సంచలన విషయం బయటపెట్టారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీప బంధువులు కూడా.. ఈ బియ్యం దందాలో ఉన్నారని ఆరోపించారు. వారి జోలికి వెళ్లకుండా పవన్ వెనుకడుగు వేశారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఈ అంశం యూ టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇటువంటి తరుణంలో క్యాబినెట్ భేటీ జరుగుతుండడంతో.. బియ్యం దందాపై సీరియస్ గా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.