Pulivendula By Election: పులివెందులకు( pulivendula ) ఉప ఎన్నిక రానుందా? జగన్ పై అనర్హత వేటు వేస్తారా? టిడిపి కూటమి భారీ ప్లాన్ తో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో టిడిపి ఏకపక్ష గెలుపుతో నమ్మకం వచ్చింది. వైయస్ కుటుంబ కంచుకోట ను బద్దలు కొట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు జగనే ఆయుధం ఇస్తున్నట్టు అయ్యింది. అసెంబ్లీకి జగన్ వరుసగా గైర్హాజరు కావడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. మధ్యలో ఒకసారి గవర్నర్ ప్రసంగం కోసం హాజరయ్యారు. అయితే అది పరిగణలోకి రాదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వరుసగా నిబంధనల ప్రకారం 60 రోజులు దాటి సభకు హాజరు కాకుంటే ఆటోమేటిక్ గా అనర్హత వేటు పడుతుంది. అందుకే ఇప్పుడు పులివెందుల విషయంలో ఓటమి సరికొత్త అస్త్రంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
* డిప్యూటీ స్పీకర్ సంచలనం..
తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( deputy speaker Raghu Ramakrishna Raju ) పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందని లీకులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లడు చాక్లెట్ కోరిక మాదిరిగా ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నారని.. చేజేతులా ఎమ్మెల్యే సీటును వదులుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరుగురు జగన్మోహన్ రెడ్డి తో సంబంధం లేకుండా సభకు హాజరవుతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఆ ఆరుగురు ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. జగన్ సైతం తనకు ప్రత్యేక హోదా ఇస్తేనే సభకు హాజరవుతానని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే శాసనసభ చట్టంలో 60 రోజులపాటు సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడవచ్చన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను అనుసరించి జగన్మోహన్ రెడ్డి పై వేటు వేస్తారని తెలుస్తోంది.
* ఆ ధైర్యం తోనే..
పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి ( Telugu Desam Party)ఏకపక్ష విజయం సాధించింది. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఈ విజయం అధికార దుర్వినియోగంతో సొంతం చేస్తుందని తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. మరి డిపాజిట్లు రాకపోవడం అనేది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని తెగ్గొట్టాలి అంటే ఉప ఎన్నిక సరైన ఆయుధమని కూటమి భావిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శిబిరంలో ఈ ప్రచారం ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే ఇది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.