Butta Renuka : వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. పారిశ్రామిక, వ్యాపార రంగాల నుంచి రాజకీయాల వైపు వచ్చినవారు చాలా అప్రమత్తంగా ఉంటారు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని వారికి తెలుసు. అయితే ఈ విషయంలో మూల్యం చెల్లించుకున్నారు మాజీ ఎంపీ బుట్టా రేణుక( Butta Renuka ). వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రేణుక 2014 ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా గెలిచారు. అత్యంత సీనియర్ నేతగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ని ఓడించి లోక్ సభలో అడుగుపెట్టారు. అటు తరువాత రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఆమె పాలిట శాపంగా మారాయి.
Also Read : పిసిసి మాజీ అధ్యక్షుడికి కీలక బాధ్యతలు ఇచ్చిన జగన్!
* టిడిపిలోకి వచ్చినట్టే వచ్చి..
2014లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం గౌరవప్రదమైన స్థానాలను తెచ్చుకొని ప్రతిపక్షంగా ఉంది. బుట్టా రేణుక ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. విద్యాధికురాలిగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా గుర్తింపు పొందారు రేణుక. అయితే 2018లో ఆమె టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి ఆమె కౌంట్ డౌన్ మొదలైంది. తెలుగుదేశం పార్టీలో చేరినా.. ఆమెకు కోరుకున్న సీటు దక్కలేదు. కనీసం ఎక్కడా సర్దుబాటు కూడా చేయలేదు. దీంతో టీడీపీలోకి వచ్చినట్టే వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళిపోయారు.
* ఆ తప్పుడు నిర్ణయంతో..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress party ) కొనసాగి ఉంటే 2019లో సైతం ఆమెకే కర్నూలు పార్లమెంట్ టికెట్ ఇచ్చేవారు. టిడిపిలోకి వెళ్లి తిరిగి రావడంతో ఆమెకు టికెట్ నిరాకరించారు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 మధ్య ఆమె పార్టీకి తన సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. అయితే అధినేతను ఎలాగోలా ఒప్పించి 2019లో ఎమ్మిగనూరు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు రేణుక. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి మరి జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. బీసీ తారక మంత్రం పనిచేస్తుందని భావించారు. కానీ కూటమి ప్రభంజనంలో బుట్టా రేణుక ఓడిపోయారు.
* రెండు రంగాల్లో మైనస్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి( chennakeshava Reddy ) రూపంలో ఆమెకు వ్యతిరేక వర్గం ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఆ వర్గం వ్యతిరేకించింది. ప్రస్తుతం కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ఇంకోవైపు వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె ఆస్తులు వేలానికి సిద్ధంగా ఉన్నాయి. అటు రాజకీయంగా కలిసి రాక.. ఇటు వ్యాపార పరంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యాపార రంగం తిందని ఆమె బాధపడుతున్నారు. అందుకే రాజకీయాలనుంచి నిష్క్రమించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి ఆమె నిర్ణయం ఎలా ఉంటుందో.