Monsoons : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 20 రోజులు కావొస్తున్నా వాన చినుకు జాడలేదు. రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. దుక్కులు దున్ని విత్తనాలు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్న రైతులు చినుకు జాడ కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దేశంలోకి వారం ఆలస్యంగా ప్రవేశించిన రుతుపవనాలు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు నెమ్మదిగా కదులుతున్నాయి. కేరళ, కర్ణాటకలో విస్తరించిన నైరుతి.. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడం లేదు. దీంతో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ కీలక సమాచారం ఇచ్చింది.
ఏపీలోనే ఆగిపోయిన రుతుపవనాలు..
రుతుపవనాలు ఐదు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలోకి ప్రవేశించాయి. శ్రీహరికోట..పుట్టపర్తి వరకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలటం లేదు. దీంతో ఎండలు.. వడగాల్పులతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవటంతో వాతావరణం చల్లబడడం లేదు.
తుపానుతో ఆటంకం..
అరేబియా సముద్రంలో ఉన్న అతి తీవ్ర తుఫాను బిపోర్‌జాయ్ రుతుపవనాల కదలికపై ప్రభావం చూపుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుపాను కారణంగా రుతుపవనాల్లో కదలిక లేక ఆగిపోయాయని పేర్కొంటున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కూడా తుపానే కారణమని అంటున్నారు.
తీరం దాటితేనే రుతుపవనాల్లో కదలిక..
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను తీరం దాటి బలహీనపడిన తరువాతనే రుతుపవనాల్లో చలనం వస్తుందని చెబుతున్నారు. ఈ నెల 17 తర్వాతనే రుతుపవనాల్లో కదలిక వస్తుందని పేర్కొంటున్నారు. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలోని 137 మండలాల్లో తీవ్ర వడగాలులు, 203 మండలాల్లో వడగాలులు బుధవారం వీచాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో మూడు రోజులు ఎండలే..
మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతవారణ శాఖ అంచనా వేసింది. అనేక మండలాల్లో 40–45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ వడగాల్పులు అధికంగా వీస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్డ్ జారీ చేసింది.
వడగండ్ల వానలు..
ఒకవైపు ఎండలు కొనసాగుతూనే మరోవైపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలకు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మెదక్ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది.