Modi – Jagan : ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ.. జగన్ కు మోడీ వరం వెనుక కారణమిదీ

ఒక వైపు బీజేపీ నాయకత్వం మార్పు, ఇప్పుడు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ అంటూ ప్రచారం జరుగుతుండడంతో ఏపీలో పొలిటికల్ కాక పెరిగింది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నదానిపై త్వరలో క్లారిటీ రానుంది.

Written By: Dharma, Updated On : July 5, 2023 4:18 pm
Follow us on

Modi – Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో అడుగుపెట్టనే లేదు అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఇలా జగన్ వస్తున్నారని తెలిసి ఢిల్లీ పెద్దలు రకరకాల ప్రయోజనాలు కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. సీఎం జగన్ రెండురోజుల పర్యటనకుగాను బుధవారం ఢిల్లీ వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు. రేపు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జల వనరుల శాఖ మంత్రి షేకావత్ లను కలిసి వినతిపత్రాలు అందించనున్నారు. అయితే జగన్ ఇంకా ఢిల్లీ వెళ్లకుండానే రకరకాల ప్రచారాలు ఊపందుకోవడం విశేషం
ప్రధానంగా జగన్ ఢిల్లీ వెళుతున్న ప్రతిసారి ప్రత్యేక హోదా, పోలవరం వంటి అంశాలు ప్రస్తావనకు వస్తుంటాయి. అయితే వాటికి కేంద్రం పెద్దగా సీరియస్ తీసుకున్న సందర్భాలు లేవు. సీఎం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇలాంటివి ప్రత్యేక ప్రకటనలకు పరిమితమవుతుంటాయి. ఈసారి కూడా జగన్ అవే అంశాలను ప్రాధాన్యతగా తీసుకొని ఢిల్లీ వెళుతున్నట్టు వార్తలు వచ్చాయి. వీటికి తోడు కొత్తగా మూడు రాజధానుల అంశంతో పాటు రుణ పరిమితి పెంపు వంటి విన్నపం కొరకే పెద్దలను కలుస్తున్నారని.. ఎన్నికల ముంగిట జగన్ కు అవి కీలకమని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ పక్కకు వెళ్లాయి. జగన్ ఇంకా పెద్దలను కలిసి అడక్కుండానే బుందేల్ ఖండ్ తరహాలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారన్న ప్రచారం సర్వత్రా వ్యాపించింది, గతంలో చంద్రబాబు హయాంలో ఇటువంటి ప్రకటనే వచ్చింది. కానీ అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం జరుగుతుండడంతో వాస్తవమా? కాదా? అని ఏపీ ప్రజలు నమ్మలేకపోతున్నారు. అదే జరిగితే ఏపీకి 22 వేల కోట్ల రూపాయలు అందే అవకాశముందని అంచనాలు కూడా వెలువడుతున్నాయి.
ఇదే విషయాన్ని వైసీపీ అనుకూల మీడియా దీనినే హైలెట్ చేస్తోంది. ఇది జగన్ వల్లే సాధ్యమని ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. సరైనోడు సీఎం అయితే ఫలితం ఇలానే ఉంటుందని వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. అంతకు మించి అనుకూల కామెంట్స్ వస్తున్నాయి. ఒక వైపు బీజేపీ నాయకత్వం మార్పు, ఇప్పుడు బుందేల్ ఖండ్ తరహాలో ప్యాకేజీ అంటూ ప్రచారం జరుగుతుండడంతో ఏపీలో పొలిటికల్ కాక పెరిగింది. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నదానిపై త్వరలో క్లారిటీ రానుంది.