Nagababu: మెగా బ్రదర్ నాగబాబుకు మరోసారి నిరాశ ఎదురయ్యింది. రాజ్యసభ పదవి ఖరారు అయిందని ప్రచారం సాగింది. అయితే ఈసారి కూడా ఆయనకు చాన్స్ లేదని తెలుస్తోంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబు విషయంలో రకరకాల ప్రచారం నడిచింది. ఆయనకు టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా అవకాశం ఇస్తారని తెగ హడావిడి నడిచింది. అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో ఆయన రాజ్యసభ పై దృష్టిపెట్టారని.. కేంద్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కుతుందని రకరకాల టాక్ అయితే నడిచింది. అయితే ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూ వచ్చారు. తనకు పదవులపై వ్యామోహం లేదని చెప్పుకొచ్చారు. జనసేనలో ఓ సామాన్య కార్యకర్తగా నడుచుకోవడమే తనకు ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు నాగబాబు. అయితే తాజాగా ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.దీంతో మరోసారి నాగబాబు పేరు తెరపైకి వచ్చింది.కచ్చితంగా నాగబాబుకు చాన్స్ ఇస్తారని టాక్ నడిచింది.కానీ ఈసారి జనసేనకు అవకాశం లేదని తెలుస్తోంది. మారిన సమీకరణలతో టిడిపికి రెండు స్థానాలు, బిజెపికి ఒక స్థానం కేటాయించే అవకాశం ఉంది. దీంతో నాగబాబుకు ఈసారి కూడా అవకాశం లేనట్టే. ఇప్పటికే టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖాయమయ్యాయి.
* జనసేనలో యాక్టివ్ రోల్
వాస్తవానికి జనసేన ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు నాగబాబు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయినా సరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి విడిచి పెట్టాల్సి వచ్చింది. దాదాపు ఎంపీగా పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు నాగబాబు. కానీ చివరి నిమిషంలో ఆ సీటును బిజెపికి కేటాయించారు. దీంతో నాగబాబు వెనక్కి రావాల్సి వచ్చింది. అయితే అక్కడితో నాగబాబు ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని బలమైన నిర్ణయానికి వచ్చారు. జనసేన తో పాటు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. కూటమిలో జనసేన తరఫున సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది.
* బలమైన ప్రచారం జరిగినా
అయితే వైసిపి రాజ్యసభ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసేసరికి తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని అందరూ అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జనసేనకు ఒక పదవి ఖాయమని.. అది నాగబాబుకేనని ప్రచారం నడిచింది. మెగా బ్రదర్ కావడంతో జనసేనలో కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవని కూడా తెలిసింది. పవన్ సిఫార్సు చేయడంతో చంద్రబాబు సైతం మరో మాట చెప్పరని కూడా అంచనా వేశారు. పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అది నాగబాబు కోసమేనని ప్రచారం నడిచింది. అయితే ఇంత జరిగినా జనసేనకు ఈసారి రాజ్యసభ ఛాన్స్ దక్కలేదు. దీంతో మరోసారి మెగా బ్రదర్ నాగబాబు కు నిరాశే ఎదురైంది.