JC Pawan Reddy: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలని భావిస్తోంది. అందుకు ఏ అవకాశం విడిచి పెట్టకూడదని చూస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జోన్లో పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో జెసి ఫ్యామిలీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అది అంత ఈజీ కాదని తెలుస్తోంది. దానికి కారణం జెసి ఫ్యామిలీ విషయంలో జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. వారు పార్టీలోకి వస్తే విభేదాలు పెరుగుతాయి తప్ప తగ్గవని పార్టీ క్యాడర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా జరుగుతోంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ తరుణంలో జెసి ఫ్యామిలీకి వ్యతిరేకంగా జిల్లా వైసీపీ నేతలు హై కమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్లు సమాచారం.
* సుదీర్ఘ నేపథ్యం..
జెసి ఫ్యామిలీకి అనంతపురం జిల్లాలో( Ananthapuram district ) సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగింది జెసి ఫ్యామిలీ. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయంగా ఎదిగింది. 2004లో తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు రాజశేఖర్ రెడ్డి. జెసి దివాకర్ రెడ్డికి తన మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. కానీ 2009లో మాత్రం దివాకర్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దివాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి. అటు తర్వాత జెసి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దగ్గర అయింది. అనంతపురం ఎంపీగా పోటీ చేసి గెలిచారు దివాకర్ రెడ్డి. 2019 ఎన్నికల్లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ తో పాటు ఎమ్మెల్యే టికెట్లను ఆశించింది జెసి ఫ్యామిలీ. కానీ పవన్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వలేదు. అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే సీటును దక్కించుకొని చట్టసభలకు వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో టిడిపిలో ఉంటే ఆశించిన స్థాయిలో సీటు రాదు అని పవన్ రెడ్డి ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం నడుస్తోంది.
* వారి అభ్యంతరాలతో..
వాస్తవానికి జెసి ఫ్యామిలీ 2014 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ప్రచారం సాగింది. అందుకు కారణం పవన్ రెడ్డి. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వ్యాపార భాగస్వామి కూడా. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో జెసి ఫ్యామిలీ టిడిపి వైపు టర్న్ అయింది. అయితే ఇప్పుడు టిడిపిలో ఉంటే తన రాజకీయ ఉన్నతి ఉండదు అని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహితంతో తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పవన్ చేరికను జిల్లా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. జెసి ఫ్యామిలీతో కేతిరెడ్డి ఫ్యామిలీకి దశాబ్దాల వైరం నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి కేతిరెడ్డి కుటుంబం ఎంతో నమ్మకమైనది. ఆ కుటుంబం నుంచి అభ్యంతరాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే పవన్ రెడ్డి చేరికకు బ్రేక్ పడినట్లు సమాచారం.