Srikakulam: తాను చనిపోయి నలుగురికి ఆయుష్షు పోసిన ఆ యువతి

శ్రీకాకుళం నగరంలోని నానుబాలు వీధిలో గల సచివాలయంలో బి. మౌనిక అనే యువతి వీఆర్వో గా పని చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

Written By: Dharma, Updated On : November 27, 2023 5:23 pm
Follow us on

Srikakulam: ఇతరులలో తమ కుమార్తెను చూసుకోవచ్చని భావించిన ఆ తల్లిదండ్రులు ఆమె అవయవ దానానికి ముందుకు వచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన కుమార్తె బాధను తట్టుకోలేక.. ఆమె అవయవాలతో వేరొకరికి ఆయుష్షు పోయాలని నిర్ణయించుకున్నారు. ఆ తల్లిదండ్రుల నిర్ణయానికి అంతా సలాం చేస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం నగరంలోని నానుబాలు వీధిలో గల సచివాలయంలో బి. మౌనిక అనే యువతి వీఆర్వో గా పని చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మౌనిక తలకు తీవ్ర గాయమైంది. తొలుత శ్రీకాకుళంలోని రిమ్స్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కూడా ఆమె కండీషన్ సీరియస్ గా ఉండడంతో విశాఖ తరలించారు. కానీ వారు కూడా చేతులెత్తేశారు. చివరకు శ్రీకాకుళం జమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే మౌనిక బ్రెయిన్ డెడ్ కావడంతో జీవచ్ఛవంలా ఉండిపోవాల్సి వచ్చింది. ఆ స్థితిలో ఆమెను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

అయితే ఈ క్రమంలో వైద్యులు జీవన్ ధాన్ కార్యక్రమం గురించి వివరించారు. అవయవ దానంతో చాలామందికి ఆయుష్ పోయవచ్చునని సూచించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మౌనిక అవయవాల దానానికి సమ్మతించారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యం జీవన్ ధాన్ కి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. ఆమె అవయవాల్లో గుండె, రెండు మూత్రపిండాలు, రెండు కళ్ళు మాత్రమే పనిచేస్తాయని వైద్యులు ధ్రువీకరించి వాటిని సేకరించారు.గుండెను తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అక్కడ సుస్మిత అనే మహిళ కోసం అవసరం కావడంతో ఆగ మేఘాల మీద విశాఖ ఎయిర్పోర్ట్ కు తరలించి. అక్కడ నుంచి చార్టెడ్ ఫ్లైట్లో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. ఈ క్రమంలో జమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో సిబ్బంది, మౌనిక స్నేహితులు పూలు జల్లుతూ.. కొవ్వొత్తులు వెలిగిస్తూ జోహార్లు పలికారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం అంజలి ఘటిస్తున్నారు.

మౌనిక స్వస్థలం ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామం. పేద కుటుంబానికి చెందిన ఆమె నాలుగు సంవత్సరాల క్రితం సచివాలయ ఉద్యోగానికి ఎంపికైంది. వీఆర్వోగా విధులు నిర్వహిస్తోంది. అవయవ దానం ద్వారా తమ కుమార్తె నలుగురికి ఆయుష్షు పోయడం ఆనందంగా ఉందని.. వారిలో తమ కుమార్తెను చూసుకుంటామని ఆ తల్లిదండ్రులు అంతటి బాధలో కూడా చెప్పడం విశేషం. వారి ఔదార్యానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి