Vishaka MLC Election: ఆ వ్యూహంతోనే బొత్స ఎంపిక.. టిడిపి నిలబెడుతుందా? లేదా?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని, అవమానాలను అధిగమించాలని చూస్తోంది వైసిపి. ఒక్క గెలుపుతో పార్టీ శ్రేణుల్లో ఊపు తేవాలని భావిస్తోంది. అందుకే సీనియర్ నేతను ఎంపిక చేసింది.

Written By: Dharma, Updated On : August 3, 2024 1:13 pm

Vishaka MLC Election

Follow us on

Vishaka MLC Election: సార్వత్రిక ఎన్నికల తర్వాత.. విశాఖలో మరో ఎన్నిక జరగనుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలోకి ఫిరాయించడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. భారీ మెజారిటీతో గెలిచారు కూడా. ఈ తరుణంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 30న ఎన్నిక జరగనుంది.జగన్ వ్యూహాత్మకంగా సీనియర్ నేత బొత్ససత్యనారాయణ ను అభ్యర్థిగా ప్రకటించారు. స్థానిక సంస్థలకు సంబంధించి విశాఖ జిల్లాలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. కూటమి కంటే దాదాపు 600 ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే స్థానిక నాయకులను నిలబెడితే.. అధికార కూటమి అభ్యర్థికి ఢీకొట్టగలరా? లేదా? అన్న అనుమానం ఉండేది. అందుకే బలవంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణ ను ఎంపిక చేశారు. జగన్ రెండు వ్యూహాలతో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి చేరికలు ఆపడం, అద్భుత విజయం సొంతం చేసుకొని.. టిడిపి కూటమిని దెబ్బతీయడం. ఈ రెండు కారణాలతోనే బొత్సను రంగంలోకి దించారు జగన్. బొత్స ఎంపికతో జగన్ తో పాటు వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది. కచ్చితంగా గెలుస్తామన్న నిర్ణయానికి వైసీపీ శ్రేణులు వస్తున్నారు. టిడిపి కూటమికి ముచ్చెమటలు పట్టడం ఖాయమని చెబుతున్నారు.

* స్పష్టత కరువు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే కూటమిలో టిడిపికే ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో టిడిపికి ప్రాతినిధ్యం ఎక్కువ. అందుకే ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లాలో.. విశాఖ ఉత్తరం, దక్షిణం,అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి తదితర అసెంబ్లీ స్థానాలను వదులుకుంది టిడిపి. అందుకే ఆ పార్టీ నేతలు ఎమ్మెల్సీ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ పార్టీకి విడిచిపెట్టడమే ఉత్తమమని మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* గండి బాబ్జి పేరు
ప్రధానంగా గండి బాబ్జి పేరు వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ ను ఆశించారు. కానీ అనూహ్యంగా ఆ సీటు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. దీంతో బాబ్జి అసంతృప్తికి గురయ్యారు. పార్టీ హై కమాండ్ మాత్రం విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందుకే ఇప్పుడు గండి బాబ్జి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

* ఆశావహులు అధికం
తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య సైతం అధికంగా ఉంది. సీనియర్ నేత దాడి వీరభద్రరావు, ఇలా గోవింద్, సీతం రాజు సుధాకర్, మైనారిటీ నేత నజీర్ తదితరులు సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఈరోజు టిడిపి అభ్యర్థికి సంబంధించి హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు వైసీపీకి బలం ఎక్కువగా ఉండడంతో.. టిడిపి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏం జరుగుతుందో కొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.