Nellore politics  : నెల్లూరు కార్పొరేషన్ పీఠంపై అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్.. కోటంరెడ్డి భారీ స్కెచ్

నెల్లూరు రాజకీయాలు దూకుడుగా ఉంటాయి. నిత్యం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి తలెత్తింది. వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన నెల్లూరు కార్పొరేషన్ లో టిడిపి పాగా వేయనుంది.

Written By: Dharma, Updated On : September 13, 2024 9:43 am

Nellore Municipal Corporation

Follow us on

Nellore politics : వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి అండగా నిలిచింది. 2014 ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. 2019 ఎన్నికల్లో వైట్ వాష్ చేసింది. అన్ని స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. పదికి పది స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. వైసీపీకి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు వైసీపీ కీలక నేతలంతా టిడిపి బాట పట్టారు. టిడిపి నేతలు సమన్వయంతో పని చేశారు. అన్ని నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. అనుకున్నట్టే గెలుపొందారు. అయితే ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. డిప్యూటీ మేయర్ రూపేష్ కుమార్ యాదవ్ ను చైర్మన్ గా ఎన్నుకునేందుకు పావులు కదుపుతున్నారు. రూపేష్ కుమార్ స్వయానా అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్.

* టిడిపిలోకి 29 మంది కార్పొరేటర్లు
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి ఏకపక్షంగా విజయం సాధించింది. 56 కార్పొరేటర్ స్థానాలను గెలిచింది. అయితే ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో చాలామంది కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. మరికొందరు ఎన్నికల అనంతరం చేరిపోయారు. ప్రస్తుతం 29 మంది కార్పొరేటర్లు టిడిపిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరిని పార్టీలోకి తీసుకొని నెల్లూరు కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్నది కోటంరెడ్డి ప్లాన్.

* టిడిపిలోకి వచ్చినట్టే వచ్చి
నెల్లూరు కార్పొరేషన్ చైర్ పర్సన్ గా ప్రస్తుతం స్రవంతి కొనసాగుతున్నారు. ఆమె కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రధాన అనుచరురాలు. వైసీపీని వీడి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన అంటే నడుస్తామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికలకు ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపుమేరకు ఆమె వైసీపీ గూటికి చేరారు. ఆమె భర్త జయవర్ధన్ ఎన్నికల సమయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల అనంతరం మేయర్ స్రవంతి తో పాటు ఆమె భర్త టిడిపిలో చేరేందుకు సిద్ధపడ్డారు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు.

* తెరపైకి పాత కేసులు
మేయర్ స్రవంతి తనకు తాను పదవికి రాజీనామా చేసే విధంగా కోటంరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఆమె భర్త పై ఫోర్జరీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన నారాయణ మున్సిపల్ మంత్రిగా ఉన్నారు. స్రవంతి భర్త పై పాత కేసులను తెరపైకి తెచ్చి తన రూట్లోకి తెచ్చుకోవాలని కోటంరెడ్డి భావిస్తున్నారు. అలా స్రవంతితో రాజీనామా చేయించి.. రూపేష్ కుమార్ యాదవ్ ను మేయర్ గా ఎన్నుకోవాలన్నది ప్లాన్. ప్రస్తుత చైర్పర్సన్ స్రవంతి రాజీనామా, లేకుంటే సెలవులపై పంపించేందుకు చర్చలు పూర్తయినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాపై వైసిపి పట్టు వదులుకున్నట్లే.