BJP Vs Janasena : వైసీపీతో సంబంధం లేదని చెప్పుకునేందుకు బీజేపీ ఆపసోపాలు పడుతోంది. తాము వైసీపీ సర్కారుపై పోరాటం చేస్తున్నామని చెప్పుకొస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఓ బీజేపీ నాయకుడు వైసీపీ సర్కారుకు వకల్తా పుచ్చుకున్నారు. అది కూడా మిత్రపక్షం జనసేన చేసిన ఓ బలమైన ఆరోపణకు అచ్చం వైసీపీ నేతలా కౌంటర్ ఇచ్చారు. ఆ పార్టీకి అసలుసిసలైన అధికార ప్రతినిధిగా మాట్లాడేసరికి మిత్రపక్షాలు బీజేపీ, జనసేన మధ్య మంటలు చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెండు పార్టీల మైత్రిపై ప్రభావం చూపేలా ఉన్నాయి.
వారాహి యాత్రలో భాగంగా పవన్ తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా జరుగుతున్న అక్రమాల గురించి ప్రస్తావించిన సంగతి తెలిసింద. శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10 వేలు విరాళంగా ఇస్తే రూ.500, రూ.1000 గా రశీదు ఇస్తున్నారని.. మిగతా మొత్తం ఎటుపోతోందని పవన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ వర్గాలు కానీ.. పాలకవర్గం కానీ సరైన రిప్లయ్ ఇవ్వలేదు. కానీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాత్రం స్పందించారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కదారి పట్టడం లేదని.. హిందూ దేవాలయాల్లో ధీప ధూప నైవేద్యాలకు ఖర్చుపెడుతున్నారని చెప్పుకొచ్చారు. టీటీడీతో రాజకీయాలు వద్దని జనసేనకు హితవు పలికారు.
అయితే భానుప్రకాష్ రెడ్డి స్పందనతో బీజేపీ ఒక్కసారిగా షాక్ కు గురైంది. తన వ్యక్తిగత అభిప్రాయం ఉంటే మనసులో ఉంచుకోవాలే కానీ.. ఇలా బహిరంగంగా వ్యక్తం చేయడం ఏమిటన్న చర్చ ప్రారంభమైంది. దీనిపై జనసేన కౌంటర్ అటాక్ చేయడంతో బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. జనసేన నేత కిరణ్ రాయల్ దీనిపై స్పందించారు. భానుప్రకాష్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.1100 కోట్లు వచ్చాయని భానుప్రకాశ్ రెడ్డి చెబుతుంటే..వైవీ సుబ్బారెడ్డి మాత్రం రూ.800 కోట్లు వచ్చాయని చెబుతున్నారని.. మిగతా రూ.300 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.
పవన్ శ్రీవాణి ట్రస్ట్ అంశాన్ని లేవనెత్తిన తరువాత అధికార వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ స్పందించలేదు. ఆ సాహసం కూడా చేయలేదు. సెడన్ గా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పందించడం మాత్రం బీజేపీతో పాటు వైసీపీలో చర్చనీయాంశమైంది. తామకు వైసీపీతో ఎటువంటి సంబంధం లేదని ప్రయత్నం చేస్తుంటే.. ఇప్పుడు అడ్డంగా బుక్ చేశారని భానుప్రకాష్ రెడ్డిపై బీజేపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ఇక్కడితో ముగించాలని జనసేన చూడడం లేదు. వైసీపీ నేతలతో అంటగాకుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతమందిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి. మున్ముందు బీజేపీ, జనసేన మధ్య వివాదం ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.