Sujana Chaudhary : రాజకీయాలపై అసంతృప్తితో చంద్రబాబు అంతరంగిక నేత!

పూలు అమ్ముకున్నచోట కట్టెలు అమ్ముకోలేం. ఈ సామెతలో ఎంతో నిగూడార్థం ఉంది. రాజకీయాల్లో కీలక పదవులు అనుభవించిన వారు.. కిందిస్థాయి పదవులను తీసుకోరు. కానీ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి.

Written By: Dharma, Updated On : October 24, 2024 11:47 am

BJP MLA Sujana Chaudhary

Follow us on

Sujana Chaudhary : బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి అసంతృప్తిగా ఉన్నారా? ఢిల్లీ రాజకీయాలే మేలని భావిస్తున్నారా? అనవసరంగా ఎమ్మెల్యేగా పోటీ చేశానని బాధపడుతున్నారా? అంటే అవునని సమాధానం వినిపిస్తోంది.జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సుజనా చౌదరి. భారీ మెజారిటీతో గెలిచారు.మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా బిజెపి తరఫున మంత్రి పదవిని దక్కించుకున్నారు సత్య కుమార్ యాదవ్. దీంతో అప్పటి నుంచి తీవ్ర అసంతృప్తితోనే సుజనా చౌదరి ఉంటున్నారు. నియోజకవర్గంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. విజయవాడకు వరదలు ముంచెత్తినప్పుడు సైతం సుజనా కనిపించలేదు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా యాక్టివ్ లేరు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

* అప్పట్లో కేంద్రమంత్రిగా
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ లో కీలక భాగస్వామిగా ఉండేది. ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడంతో పదవి పోగొట్టుకున్నారు. అప్పట్లోనే బిజెపిని వదులుకోవద్దని చంద్రబాబుకు సూచించారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బిజెపిలో చేరారు. చంద్రబాబుకు అత్యంత అంతరంగికులుగా ఈ ఇద్దరికి పేరు ఉంది. స్వయంగా చంద్రబాబు వీరిని బిజెపిలో చేర్పించాలని ప్రచారం జరిగింది. అయితే అందరి అనుమానాలకు తగ్గట్టే ఈ ఎన్నికల్లో బిజెపితో టిడిపి జత కలవడం వెనుక వీరిద్దరి పాత్ర ఉన్నట్లు తేలింది.

* ఆ ఆశతోనే
ఏపీలో కూటమి ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఎంపీగా సుజనా చౌదరి పోటీ చేస్తారని అంచనాలు ఉండేవి. అయితే వాటికి భిన్నంగా ఈసారి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన గెలవడమే తరువాయి చంద్రబాబు క్యాబినెట్లో కీలక మంత్రి పదవి దక్కించుకుంటారని అప్పట్లో విశ్లేషణలుకూడా వచ్చాయి. అయితే సుజనా చౌదరి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు సర్కార్లో మాత్రం అవకాశం దక్కలేదు. బిజెపి నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనూహ్యంగా ధర్మవరం నుంచి గెలిచిన సత్య కుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. ఆది నుంచి పార్టీలో పని చేసిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలని హై కమాండ్ ఆదేశించినట్లు సమాచారం. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సుజనా చౌదరిని కాదని సత్య కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. కనీసం ఎంపీగా గెలిచి ఉంటే ఢిల్లీలో గౌరవం దక్కించుకునే వాడినని.. ఈ గల్లీ రాజకీయాలు చేయలేనంటూ సుజనా చౌదరి నిట్టూరుస్తున్నట్లు సమాచారం. అయితే భవిష్యత్తులోనైనా అవకాశం రాకుండా పోతుందా? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.