BJP MLA Vs TDP MLA: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుందని అధినేతలు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే అందుకు విరుద్ధంగా ఉంది. మూడు పార్టీల సమన్వయ లోపం స్పష్టమవుతోంది. ఏకంగా అసెంబ్లీ వేదికగా బిజెపి ఎమ్మెల్యే ఒకరు.. టిడిపి ఎమ్మెల్యే పై ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్రలు చేస్తున్నారని.. వైసీపీ నేతలతో చేతులు కలిపారని.. వ్యతిరేక మీడియాలో కథనాలు రాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. కూటమి పార్టీల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు.. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై అసెంబ్లీ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.
* ఎచ్చెర్ల లో క్వారీలు అధికం..
శ్రీకాకుళం జిల్లాలో( Srikakulam district) పొత్తులో భాగంగా ఎచ్చెర్ల స్థానాన్ని బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా నడికుదుటి ఈశ్వరరావు పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గంలో క్వారీలు అధికంగా ఉంటాయి. ఈ తరుణంలో గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున క్వారీలకు అనుమతులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ మరుసటి రోజే ఓ క్వారీ తవ్వకాలకు సంబంధించి వైసీపీ నేతకు భూగర్భ గనుల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. సదరు నేత క్వారీలో గ్రావెల్ తవ్వకాలకు సిద్ధపడగా స్థానికులు అడ్డుకున్నారు. అదే విషయంపై ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. ఆయన సైతం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. క్వారీకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వొద్దని సూచించారు. అప్పటినుంచి వివాదం నడుస్తూనే ఉంది.
* వ్యతిరేక మీడియాలో కథనాలు..
అయితే సదరు క్వారీ యాజమాన్యం నుంచి ఎచ్చర్ల ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని.. ముడుపులు ఆశిస్తున్నారని.. ఇవ్వకపోవడం వల్లే ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నారు అంటూ ప్రభుత్వ వ్యతిరేక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే సదరు క్వారీ యజమాని కి అనుకూలంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవహరిస్తున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులపై నేరుగా ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గంలో రవికుమార్ ప్రమేయంపై విమర్శలు ఉన్నాయి. సదరు క్వారీ యజమాని వైసీపీ నేత అయినా.. రవికుమార్ మద్దతు తెలపడం పై మాత్రం కూటమి పార్టీల నేతల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే ఇటీవల వరుస కథనాలు రావడంతో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. సాటి కూటమి ఎమ్మెల్యే తనపై ఇలా వ్యవహరించడం పై ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
* ఎమ్మెల్యే ఆవేదన..
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న జీరో అవర్లో ఎచ్చర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడారు. తన మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచారు. నేరుగా కూన రవికుమార్ పేరు చెప్పకుండా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే అంటూ సంబోధిస్తూ.. ఆయన తనపై కుట్ర చేశారని.. లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని.. వ్యతిరేక మీడియాలో కథనాలు రాయిస్తున్నారని.. తనకు ఏ సంబంధం లేదని.. దేవుడు పై ప్రమాణం చేస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలా శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీల ఎమ్మెల్యేల మధ్య ఫైట్ తారస్థాయికి చేరడం సంచలనంగా మారింది.