TDP BJP Alliance: ఏపీలో పొత్తు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. టిడిపితో ఇప్పటికే జనసేన పొత్తు పెట్టుకుంది. బిజెపి నుంచి ఎటువంటి స్పష్టత లేదు. కానీ బిజెపిలోని ప్రో టిడిపి నేతలు మాత్రం పొత్తు ఖాయమైందని.. ప్రకటన రావాల్సిందే తరువాయి అని చెబుతున్నారు. జనవరి మొదటి వారంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుందని.. అది జరిగిన వెంటనే పొత్తు పై కీలక ప్రకటన వస్తుందని చెప్పుకొస్తున్నారు. బిజెపి కలిసి రాక తప్పదని టిడిపి నేతలు కూడా అంచనా వేస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తామని పవన్ ఇప్పటికే తేల్చి చెప్పారు. బిజెపి సైతం కలిసి వస్తుందని.. అవసరమైతే ఒప్పిస్తానని కూడాచాలా సందర్భాల్లో చెప్పారు.అయితే ఏపీ విషయంలో బిజెపి ఒక నిర్ణయానికి వచ్చిందని ప్రచారం జరుగుతోంది.తాజాగా టిడిపి, జనసేనతో కలిసి బిజెపి పొత్తు పెట్టుకుందన్న చర్చ బలంగా నడుస్తోంది. పది నుంచి 12 అసెంబ్లీ సీట్లు బిజెపి అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో కీలక నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం.
మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొద్దుటూరు,విష్ణు కుమార్ రాజు విశాఖ ఉత్తర, భూమా కిషోర్ రెడ్డి కోసం ఆళ్లగడ్డ, వరదాపురం సూరి కోసం ధర్మవరం, సోమ వీర్రాజు కోసం రాజమండ్రి, సురేష్ రెడ్డి కోసం నెల్లూరు రూరల్, గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఒక్కో సీటు, అరకు లేదా పాడేరులో ఒక నియోజకవర్గం బిజెపి కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపి మాత్రంఅన్ని స్థానాలు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేయనట్లు తెలుస్తోంది. అవసరమైతే లోక్ సభ స్థానాలు వదులుకునేందుకు సిద్ధమని సంకేతాలు పంపినట్లు సమాచారం. అయితే బిజెపి పార్లమెంటరీ బోర్డుకు ఈ ప్రతిపాదనలు వెళ్తాయని.. వారు ఫైనలైజ్ చేసి పొత్తు పై కీలక ప్రకటన చేస్తారని రాష్ట్ర బిజెపి నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.