AP BJP: ఏపీలో టిడిపి బలం పెంచుకోవాలని భావిస్తోందా? సొంతంగా ఎదగాలని చూస్తోందా? ఓ సామాజిక వర్గంపై ఫోకస్ చేసిందా? ఆ కులానికి చెందిన నేతలకు గాలం వేయాలని అనుకుంటుందా? రాయలసీమకు చెందిన ఓ కీలక నేతకు బాధ్యతలు అప్పగించబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కమలనాధులు భారీ స్కెచ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా ఏపీలో బలపడాలని బిజెపి భావిస్తూ వచ్చింది. కానీ అనుకున్నది సాధించలేకపోతోంది. కేవలం పొత్తుల ద్వారా మాత్రమే గెలుచుకుంటూ వస్తోంది. సొంతంగా మాత్రం నెగ్గుకు రావడం లేదు. దీనికి కారణాలు అన్వేషిస్తోంది కాషాయ దళం. క్షేత్రస్థాయిలో పార్టీ బలపడకపోవడమే అందుకు కారణమని గుర్తించింది. ఏదో ఒక ప్రధాన సామాజిక వర్గం మద్దతు అవసరమని భావిస్తోంది. టిడిపికి కమ్మ సామాజిక వర్గంతో పాటు బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారు. వైసిపికి రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు అండగా నిలిచారు. జనసేనకు కాపుల మద్దతు ఉంది. కానీ బిజెపికి మాత్రం ఏ సామాజిక వర్గం మద్దతు లేదు.
* రకరకాల ప్రయోగాలు చేసినా
బిజెపి రకరకాల ప్రయోగాలు చేసింది. చాలా సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ పగ్గాలు అప్పగించింది. ప్రధానంగా నవ్యాంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాలకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన కంభంపాటి హరిబాబు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అటు తరువాత కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అటు తరువాత ఆయనను మార్చి సోము వీర్రాజుకు అప్పగించింది. ఈయన కూడా కాపు సామాజిక వర్గం నేత. అయితే గత ఏడాది పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది బిజెపి హై కమాండ్. ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత.
* నవ్యాంధ్రప్రదేశ్ లో ఒక్కసారి కూడా
అయితే రెడ్డి సామాజిక వర్గానికి ఇంతవరకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించలేదు. అందుకే ఈసారి ఆ సామాజిక వర్గానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందోనని ఆలోచన చేసినట్లు సమాచారం. అదే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇస్తే రాయలసీమలో రెడ్లు బిజెపి వైపు టర్న్ అవుతారని హై కమాండ్ పెద్దలు ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు బిజెపిలో చాలామంది ఉన్నారు. అయితేమరి ముఖ్యంగా కనిపిస్తున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.ఆయన అయితే పార్టీ బలోపేతం కావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి.
* ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం
ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం గా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించారు. వైయస్ అకాల మరణంతో రోశయ్య సీఎం అయ్యారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో ముందుకెళ్ల లేకపోయారు. అటువంటి క్లిష్ట సమయంలో స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసింది హై కమాండ్. అయితే తన పదవీ కాలాన్ని బాగానే వినియోగించుకున్నారు కిరణ్. మంచి పాలన అందించారని గుర్తింపు పొందారు. కానీ రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. కానీ కిరణ్ నాయకత్వం మాత్రం గుర్తింపు పొందింది. అయితే ఐదేళ్ల జగన్ పాలన కంటే.. కిరణ్ కుమార్ రెడ్డి బాగానే పాలించారన్నవారు ఎక్కువమంది ఉన్నారు.
* ఆ వర్గం యూ టర్న్
వైసీపీని ఎంతగానో ఆదరించారు రెడ్డి సామాజిక వర్గం వారు.జగన్ వస్తే తమకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావించారు.కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో అలా జరగలేదు.ఆ నలుగురు తప్ప రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఒరిగిందేమీ లేదు.అందుకే ఎన్నికల్లో వారు బాగా పనిచేయలేదు. వైసిపి ఓటమితో చాలామంది నేతలు స్తబ్దుగా ఉండిపోయారు. ఇప్పుడు కానీ కిరణ్ కుమార్ కు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే.. వైసీపీలోని రెడ్డి అసమ్మతి నాయకులు యు టర్న్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి పగ్గాలు అప్పగించేందుకు బిజెపి హై కమాండ్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Bjp is a huge sketch on ap
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com