AP BJP: ఏపీలో తొలి జాబితా ప్రకటనకు టిడిపి, జనసేన సిద్ధపడుతోంది. దాదాపు 65 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఈరోజు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ 50 నుంచి 52, జనసేన 15 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ ఈ తొలి జాబితా ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే బిజెపి లేకుండా రెండు పార్టీలు జాబితా విడుదల చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కానీ టిడిపి అనుకూల మీడియా మాత్రం బిజెపి హై కమాండ్ కు సమాచారం అందించినట్లు.. మంచి ముహూర్తం కావడం వల్లే ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాలను ప్రకటిస్తున్నట్లు చెప్పుకొస్తోంది. అయితే ఈ రీజన్ సిల్లీగా ఉంది. ఒకవైపు బిజెపితో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది అని చెబుతూనే.. అదే పార్టీ లేకుండా అభ్యర్థుల ప్రకటన ఏమిటన్న కామెంట్ వినిపిస్తోంది. దీని వెనుక ఏదో కథ ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఆ మధ్యన ఢిల్లీ వెళ్లారు. బిజెపి అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలతో సమావేశమయ్యారు. అటు తరువాత కలిసింది లేదు. కనీసం మాట్లాడింది లేదు. అయినా సరే బిజెపితో పొత్తు సానుకూలంగా ఉందని.. సీట్ల సర్దుబాటు సైతం దాదాపు కొలిక్కి వచ్చిందని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అటు కేంద్ర పెద్దలు సైతం పెద్దగా స్పందించడం లేదు. ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలను ఒప్పిస్తారన్న పవన్ కూడా అటువైపు అడుగులు వేయడం లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మాఘ పౌర్ణమి మంచి రోజు అని చెబుతూ జాబితా ప్రకటనకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది. అసలు బిజెపి ఉద్దేశం ఏమిటి అన్నది బయటపడడం లేదు.
2014 ఎన్నికల్లో 13 అసెంబ్లీ స్థానాలతో పాటు నాలుగు పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. ఆ సమయంలో జాతీయ స్థాయిలో బిజెపి బలం అంతంత మాత్రమే. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా బిజెపి బలోపేతం అయ్యింది. ఇప్పుడు ఒక బలీయమైన శక్తిగా మారింది. అందుకే ఈసారి పొత్తులో భాగంగా సింహ భాగం ప్రయోజనాలను బిజెపి ఆశిస్తోంది. 2014లో దక్కిన సీట్లకు మించి టిడిపిని అడుగుతోందని ప్రచారం ఉంది. ఒక్క చంద్రబాబు పవర్ అనుభవిస్తే చాలదని.. పవన్ తో పాటు బిజెపికి పవర్ షేరింగ్ ఇవ్వాల్సిందేనని బిజెపి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో బిజెపి లేకుండా సీట్ల ప్రకటన చేయడం వెనుక ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది.ఈరోజు చంద్రబాబు, పవన్ లు ఉమ్మడిగా రెండు పార్టీల అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే దీనిపై బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.