IAS Krishna Teja : కేరళ యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజ ఏపీకి వస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విన్నపం మేరకు ఆయనను ఏపీకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. కేరళ ప్రభుత్వం ఆయనను ఏపీకి పంపించేందుకు నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఏపీకి డిప్యూటేషన్ పై పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆమోదం తెలిపింది. వచ్చే వారంలో ఆయన ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది.
కృష్ణ తేజ స్వరాష్ట్రం ఏపీ. చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ 2015 కేరళ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా విధుల్లో చేరారు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కృష్ణ తేజ పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవడం విశేషం. తండ్రి శివానంద కుమార్ హోల్ సేల్ వ్యాపారి. తల్లి భువనేశ్వరి గృహిణి. గుంటూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన కృష్ణ తేజ.. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నారు.తరువాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు. 2015 జూన్ 16న ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు.ఐఏఎస్ గా ఉద్యోగంలో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి,మహిళా సాధికారిత , మహిళా విద్యను ప్రోత్సహించారు.
కృష్ణ తేజ ట్రాక్ రికార్డ్ అత్యుత్తమంగా నిలిచింది. వరదల సమయంలో విశేష సేవలు అందించారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలకు ఉత్తమ విద్య అందించేందుకు శ్రీకారం చుట్టారు. మరోవైపు భర్తలను కోల్పోయిన మహిళలకు పింఛన్లు అందించారు. వారికి స్వయం ఉపాధి పథకాలు అందించారు. ఇళ్లు నిర్మించారు.ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కృష్ణ తేజ కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. గతంలో కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగా, ఎస్సీల అభివృద్ధి విభాగం డైరెక్టర్ గా, అలప్పుజ జిల్లా కలెక్టర్ గా పని చేసిన అనుభవం ఉంది. కేరళలో తన పనితీరుతో సమర్ధుడైన ఐఏఎస్ అధికారిగా కృష్ణ తేజ మంచి పేరు తెచ్చుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇటీవలే కృష్ణ తేజ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. సమర్థులైన అధికారులను ఏపీకి రప్పించే భాగంగా.. కృష్ణ తేజకు కేరళ నుంచి రప్పిస్తున్నారు. కృష్ణ తేజను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఓ ఎస్ డి గా నియమించే అవకాశాలు ఉన్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కృష్ణ తేజను చాలా సందర్భాల్లో అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనను ఓ ఎస్ డి గా ఏపీకి తీసుకురావాలని భావించారు. వాస్తవానికి మంత్రులకు ఓఎస్డీలుగా ఆర్డీవో స్థాయి అధికారులు మాత్రమే ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ విన్నపం మేరకు ఐఏఎస్ అధికారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకంగా కృష్ణ తేజ కోసం పవన్ కోరడంతో వెంటనే కేంద్రానికి లేఖ రాశారు. దానికి కేంద్రం ఆమోదం తెలపడం, కేరళ ప్రభుత్వం పంపించేందుకు నిరభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కృష్ణ తేజ ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం గ్రామీణ పాలన అంతా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. ఈ తరుణంలో సమర్ధులైన అధికారులను తన వద్ద పెట్టుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కృష్ణ తేజ కోసం ప్రయత్నించారు. అందులో సక్సెస్ అయ్యారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Biodata of young ias krishna teja coming to ap for deputy cm pawan