Bihar And Jubilee Hills Results: రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న రాజకీయ పరిణామం జరిగినా.. రెండు తెలుగు రాష్ట్రాల పై పడటం ఖాయం. ఆపై జాతీయ రాజకీయాల ప్రభావం సైతం తెలుగు రాష్ట్రాలపై ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ, బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నాయి. అయితే ఈ ఫలితాల ప్రభావం ఏపీ పై ఎలా ఉండబోతున్నాయి అనే చర్చ మాత్రం నడుస్తోంది. ఈ ఫలితాలు ఏపీలో ఎవరికీ లాభం? ఎవరికి నష్టం? అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే కచ్చితంగా మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఇబ్బందికర చర్యగా ఎక్కువమంది అభివర్ణిస్తున్నారు. దానికి కారణాలను విశ్లేషిస్తున్నారు.
* కెసిఆర్ పార్టీ ఓటమితో..
జూబ్లీహిల్స్ లో( Jubilee Hills) కాంగ్రెస్ విజయంతో రేవంత్ రెడ్డి నాయకత్వం మరింత బలపడుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే రేవంత్ ను బలహీనుడును చేయాలన్న ప్రయత్నం బిఆర్ఎస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలతో చెక్ పెట్టాలని చూసింది. కానీ ఆ పని చేయలేకపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ విజయం వైపు దూసుకెళ్తుండడంతో ఏపీలో వైసిపి డీలపడింది. కాంగ్రెస్ పార్టీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిగా చూస్తోంది. అదే సమయంలో తెలంగాణలో కెసిఆర్ తో స్నేహం కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గత పదేళ్లుగా వారి స్నేహం కొనసాగుతూ వచ్చింది. కానీ ఇద్దరూ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం కెసిఆర్ పుంజుకున్నా.. తనకు కొంతవరకు సహకారం చేస్తారని జగన్ ఆశించారు. ఆది నుంచి జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ విజయం వైపు దూసుకెళ్తుండడంతో ఎంత మాత్రం మింగుడు పడడం లేదు.
* ఎన్డీఏ కూటమిలో ఆనందం..
బీహార్ ( Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం వైపు దూసుకెళ్తుండడంతో.. ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సంతోషంతో ఉన్నాయి. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోతే.. నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి వచ్చేస్తారని అంతా భావించారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో మార్పులు వస్తాయని.. అలా వచ్చిన మార్పులతో జాతీయస్థాయిలో సెట్ కావచ్చని జగన్ చూశారు. కానీ అలా జరగలేదు. అక్కడ ఎన్ డి ఏ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. జాతీయ రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రావడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే దానికి గాను ఎదురు చూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేకుండా పోయింది. ఇప్పుడు వైసీపీ తప్పకుండా ఇండియా కూటమిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఆప్షన్ లేదు.
* నితీష్ మాదిరిగానే చంద్రబాబు..
నితీష్ కుమార్ ( Nitish Kumar)బీహార్లో 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. తిరుగులేని నేతగా ఎదిగారు. ఇప్పుడు బిజెపి సహకారంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మరోసారి అధికారాన్ని సొంతం చేసుకున్నారు. చంద్రబాబు సైతం ఇదే ఫార్ములాను అనుసరిస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా బిజెపి హవా నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం అందుతుంది. అందుకే బిజెపితో మైత్రికోసమే చంద్రబాబు ప్రయత్నిస్తారు. గతం మాదిరిగా వైసీపీ ట్రాప్ లో పడరు. సుదీర్ఘకాలం బిజెపిలో కొనసాగేందుకు బీహార్ ఎన్నికలు కారణం అయ్యాయి కూడా.