Jubilee Hills By Election Result: తెలంగాణలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయంపై ధీమా ఉన్నా.. మెజారిటీపై సందిగ్ధం ఉండేది. కానీ, తాజా ఫలితాలు.. రేవంత్‌రెడ్డికి భారీ ఊరటనిస్తున్నాయి. నవంబర్ 14న జరిగిన కౌంటింగ్‌లో ఆరు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి 15 వేలకుపైగా లీడ్‌లో ఉన్నారు. ఇంకా ఐదు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉంది. దీంతో 20 వేల మెజారిటీ ఖాయం అన్న ధీమాలో ఉన్నారు.
అంతర్గత శత్రువల నోరు మూయించేలా..
గత కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ నేతృత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్ నేతలు ఆయన నిర్ణయ విధానంపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటమి జరిగితే సీఎం పదవీకే ముప్పు తప్పదనే అంచనాలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు రాహుల్ గాంధీ నుంచి అపాయింట్‌మెంట్ దొరకడం లేదనే వార్తలు కాంగ్రెస్‌లో చర్చగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్ర నేత మాత్రమే కాకుండా ఆధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టగల నాయకుడని చూపించే అవకాశముంది. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే, ఢిల్లీలో రేవంత్ ప్రభావం మళ్లీ పెరిగే అవకాశమూ ఉన్నట్టే.
బీఆర్‌ఎస్‌కు భారీగా నష్టం..
ఇక బీఆర్‌ఎస్ ఈ ఉప ఎన్నికను తమ రెండేళ్ల పాలనకు రెఫరెండం అని ప్రకటించింది. ఫలితాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి రాజకీయ ప్రతిష్ఠకు గట్టిదెబ్బగా మారింది. పట్టణ ఓటర్లలో మారుతున్న మనస్తత్వానికి ఇది సంకేతం. మరోవైపు హైడ్రాపై బీఆర్‌ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ను గెలిపిస్తే బుల్డోజర్లు వస్తాయని, బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే బుల్డోజర్లు రాకుండా బ్రేక్ వేయవచ్చని కేటీఆర్ ప్రచారం చేశారు. కానీ ప్రజలు కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపారు.
జూబ్లీహిల్స్ విజయం రేవంత్‌కు ఒక ఊరట కంటే ఎక్కువ. అది పార్టీ ఐక్యతకు ప్రారంభ సూచన కావచ్చు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ఆయన మరింత ధైర్యంగా అడుగులు వేయడానికి ఈ ఫలితం పునాది అయ్యే అవకాశం ఉంది.