Visakhapatnam Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) విషయంలో గుడ్ న్యూస్. చాలా ఏళ్లకు ప్లాంట్ లాభాల బాట పట్టింది. గత కొద్దిరోజులుగా ప్రైవేటీకరణ అంశం కుదిపేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్లాంట్ కు ఆదాయం సమకూరింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పాటయింది విశాఖ స్టీల్ ప్లాంట్. గత కొద్దిరోజులుగా అప్పుల బాట పట్టిన ఈ ప్లాంట్ ఇప్పుడు ఆదాయాల బాట పట్టడం నిజంగా శుభ పరిణామం. గత ఏడాదిన్నర కాలంలో అనూహ్యమైన ప్రగతి వైపు అడుగులు వేస్తోంది ఈ ప్లాంట్. ఈ ఏడాది జనవరి నాటికి స్టీల్ ప్లాంట్ రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయంలో నిర్వహించిన సమీక్షలు ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ ఫౌండ్రిక్, విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి మనీష్ రాజ్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధించిన ప్రగతిని వివరించారు.
* ఘనమైన చరిత్ర..
విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఘనమైన చరిత్ర ఉంది. రికార్డు స్థాయి ఉత్పత్తితో దేశంలోనే గుర్తింపు సాధించింది ఈ ప్లాంట్. అయితే వివిధ సమస్యలతో ఉత్పత్తి తగ్గింది. సొంత గనులు ఏర్పాటు చేయకపోవడం నిజంగా లోటు. దాని మూలంగా అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరపలేకపోయింది. దీంతో నష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఉత్పత్తి సాధించకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలియడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో.. ఉద్యోగుల సమిష్టి కృషితో ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రోజుకు 19,401 టన్నుల హాట్ మెట్టల్ ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. 2024-25 రెండో త్రైమాస్కంలో ఉత్పత్తి కేవలం 9215 టన్నులకు పరిమితం కాగా.. ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్ లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో.. ఉత్పత్తి సామర్థ్యం 45 శాతం నుంచి ఏకంగా 94 శాతానికి పెరిగింది. పన్నులు, విద్యుత్ బకాయిలతో పాటు నీటి సరఫరా వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వం అందించిన తోడ్పాటు, కేంద్ర ప్రభుత్వం అందించిన రూ. 11,440 కోట్ల ఆర్థిక సాయం విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కారణాలుగా విశ్లేషిస్తున్నారు.
* గత కొద్దిరోజులుగా దుమారం..
గత కొద్దిరోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్రదుమారం రేపింది. ఈ పరిణామ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో చాలా రకాల అంశాలు బయటకు వచ్చాయి. ఉత్పత్తి తగ్గడం, ఉద్యోగుల బదిలీలతోపాటు స్వచ్ఛంద పదవీ విరమణలు వంటివి చాలా రకాల అనుమానాలకు కారణం అయ్యాయి. ఈ క్రమంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది తప్పకుండా జరిగిపోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ఆదాయం ఒక్కసారిగా పెరగడం మాత్రం నిజంగా శుభ పరిణామం. ఈ సానుకూల పరిణామాలతో ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగుపడునుంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ కార్మికులు, అధికారులు, ప్రభుత్వాల సమస్య కృషితోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. అన్ని విభాగాలు అత్యాధునిక విధానాలను ప్రవేశపెట్టి.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.