Mla koneti adhimoolam : ఇటీవల టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించారంటూ ఆధారాలతో మహిళ నేత నేరుగా హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో టిడిపి అధిష్టానం తీవ్రంగా స్పందించింది. కోనేటి ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే ఆదిమూలం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఇరు వర్గాల వారు రాజీ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు తేలిపోయినట్లు అయింది.మరోసారి చర్చకు దారితీసింది.
* ఎన్నికల ముందే టిడిపిలోకి
ఈ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు ఆదిమూలం. సత్యవేడు అసెంబ్లీ సీటును దక్కించుకున్నారు. టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే తనను లైంగికంగా వేధించారని.. ఓ టిడిపి మహిళా నేత ఎమ్మెల్యే పై సంచలన ఆరోపణలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం జతచేస్తూ టిడిపి హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో తనపై అఘాయిత్యం చేశారంటూ కొన్ని ప్రైవేటు వీడియోలను సైతం బయట పెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది.
* రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్
పార్టీ మహిళా నేతపై లైంగిక వేధింపులకు పాల్పడడం రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైసీపీ నేతలపై అదే తరహా ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో టిడిపి హై కమాండ్ సీరియస్ గా స్పందించింది. కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మరోవైపు ఎమ్మెల్యే పై ఆరోపణలు చేసిన మహిళ తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించడం, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వాయిదా వేయడం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
* ఉన్నపలంగా రాజీ
ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సీరియస్ గా వ్యవహరించారు. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వైద్య పరీక్షలు చేయించేందుకు ఒప్పుకుంది. అయితే ఇంతలో ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే కేసు నమోదు చేశారని.. అందుకే కేసును కొట్టి వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. జూలైలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇరు వర్గాల తరుపున లాయర్లు రాజీకి వచ్చారు. తమ క్లైంట్ లు రాజకీ వచ్చినట్లు చెప్పుకొచ్చారు. కోర్టు బయట సమస్యను పరిష్కరించుకునేందుకు పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.