Saamineni Udaya Bhanu : వైసీపీకి మరో షాక్ తప్పదా? మరో సీనియర్ నేత పార్టీని వీడడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది నేతలు పార్టీని వీడారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తొలుత వైసీపీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం సినీ నటుడు అలీ సైతం తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటన ఇచ్చారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇంతవరకు ఏ పార్టీలో చేరకపోయినా వైసీపీని మాత్రం వీడారు. ఇతర పార్టీల్లో చేరకపోయినా తప్పుగా ఉండిపోవాలని భావిస్తున్నారు. అయితే తాజాగా జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న సామినేని ఉదయభాను సైతం పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. జగ్గయ్యపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఉదయభాను. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహిత నేత. చిరంజీవి కుటుంబంతో సైతం మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన ఆయన 15 వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* వ్యూహాత్మకంగా సైలెంట్
ఎన్నికల ఫలితాల అనంతరం సామినేని ఉదయభాను సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉన్నారు. పార్టీ మారాలన్న నిర్ణయంతోనే ఆయన ఆంటీ ముట్టనట్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి గెలిచారు ఉదయభాను. సీనియర్ కావడంతో మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు. విస్తరణలో అయినా చాన్స్ ఇస్తారని భావించారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మెరుగైన ఓట్లు సాధించారు. మిగతా నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీలు దాటితే.. ఇక్కడ మాత్రం 15 వేలకు తగ్గించగలిగారు సామినేని ఉదయభాను.
* వైసిపి ఆవిర్భావం నుంచి
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు ఉదయభాను. అంతకుముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా మారారు. ఆయనపై ఇష్టంతోనే జగన్ పిలుపుమేరకు వైసీపీలో చేరారు. జగన్ కు అత్యంత నమ్మకమైన నేతగా ఎదిగారు. కానీ జగన్ నుంచి ఆ స్థాయిలో మంచి ఆఫర్లు దక్కించుకోలేకపోయారు. ముఖ్యంగా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు. జగన్ హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారు. మంత్రి పదవి ఇప్పించలేకపోయారు. అప్పటినుంచి ఉదయభానులో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు పార్టీకి ఘోర పరాజయం ఎదురు కావడంతో తనలోనున్న అసంతృప్తిని బయటపెట్టారు ఉదయభాను. ఆయన వైసీపీని వీడడం ఖాయమని ప్రచారం ప్రారంభమైంది.
* 1999లో తొలిసారిగా ఎమ్మెల్యే
సామినేని ఉదయభాను తొలిసారిగా 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగి విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాత్రంవైసిపి తరుపున పోటీ చేసి గెలిచారు. మంత్రివర్గంలో స్థానం ఆశించారు. కానీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ప్రభుత్వ విప్ గా మాత్రమే అవకాశం ఇచ్చారు. 2023 ఆగస్టు 25న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడుగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది.