YS Jagan: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు మారుతున్నాయి. ముఖ్యంగా నేతల రాజీనామాలు, చేరికలతో రాజకీయం ఒక్కసారిగా మారుతోంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఘోర పరాజయం చవిచూసింది. దీంతో చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇంకోవైపు వైయస్ షర్మిల తన సోదరుడు పై పట్టు బిగించాలని చూస్తున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సైతం తనదైన శైలిలో పావులు కదపడం ప్రారంభించారు. అప్పట్లో వైసీపీలోకి వస్తామన్న కాంగ్రెస్ నేతలను జగన్ పట్టించుకోలేదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ నుంచి నమ్మకస్తులైన నేతలు బయటకు వెళ్లడంతో.. కాంగ్రెస్ నేతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తున్నారు. వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ ను పార్టీలోకి రప్పించారు. ఇంకా మిగిలిన నాయకులకు సైతం గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో నలుగురు, ఐదుగురు నేతలు త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆ నాయకులతో చర్చలు పూర్తయ్యాయని.. వారు చేరడమే తరువాయి అన్న టాక్ అయితే ఉంది.
* కేంద్ర మాజీ మంత్రి
ప్రధానంగా కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు( Pallam Raju ) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ యాక్టివ్ గా లేరు. వైసీపీలోకి ఆయనను రప్పించి గోదావరి జిల్లాల బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. పల్లంరాజు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు పల్లంరాజు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉండేవి. అయితే అప్పట్లో వైసీపీలోకి వచ్చేందుకు స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు అవసరాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధపడినట్లు సమాచారం.
* రఘువీరా రెడ్డితో చర్చలు
అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి( raghveera Reddy ) సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి వ్యవహరించారు రఘురామ. రోశయ్య తో పాటు కిరణ్ క్యాబినెట్లో సైతం కొనసాగారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అనంతపురం జిల్లా రాజకీయాల దృష్ట్యా రఘువీరారెడ్డి కాంగ్రెస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. పిసిసి చీఫ్ పదవి నుంచి రఘువీరారెడ్డిని తొలగించిన తర్వాత.. ఏఐసీసీలో చోటు కల్పించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు.
* ఆ ఇద్దరు నేతలు కూడా
మరోవైపు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్( GV Harsha Kumar) సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పట్ల అనుకూలత ప్రదర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సైతం ఎండగడుతున్నారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయనకు ఆహ్వానించినట్లు సమాచారం. వీరితోపాటు కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ సైతం వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.