Chandrababu Bail
Chandrababu Bail: చంద్రబాబుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు వెల్లడించలేదు. మంగళవారం మరోసారి విచారణ జరగగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. అంతకుముందు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 10న నంద్యాల జిల్లాలో రాజకీయ పర్యటనలో ఉండగా.. చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు మార్గం గుండా విజయవాడ తీసుకొచ్చి ఏసిబి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి తరలించారు. అప్పటినుంచి ఆయన రిమాండ్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఎప్పటికప్పుడు విచారణలు, పిటిషన్లు, వాయిదాలతో చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ వచ్చింది. మరోవైపు చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్లో ఉంది. నవంబర్ 8న ఈ కేసు పై తీర్పు వెల్లడి కానుంది.అయితే ఇంతలోనే హైకోర్టులో సానుకూల తీర్పు రావడం విశేషం.
తొలుత ఏసీబీ కోర్టులో చంద్రబాబు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరుపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ముఖ్యంగా కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు ఇచ్చిన నివేదికలను పిటిషన్లో పొందుపరిచారు. దీనిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.అయితే ఈ మధ్యంతర బెయిల్ మంజూరైన నేపథ్యంలో.. మిగతా కేసులకు సంబంధించి బెయిల్ వర్తించనుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనారోగ్య కారణాల రీత్యా ఈ బెయిల్ మంజూరు కావడంతో.. మిగతా కేసుల విషయంలో సిఐడి ఎంత పట్టు బిగించినా ఫలితం ఉండదని తెలుస్తోంది.