Telangana TDP: వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే.. చటుక్కున గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు. తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత కుటుంబ సభ్యులకే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసిన చరిత్ర ఆయనది. ఆయన చేతిలో మోసపోయిన వారి జాబితా చాంతాడంత ఉంటుంది. తన ఎదుగుదలకు కృషిచేసిన రక్తసంబంధీకులనే పాతాళానికి తొక్కి పెట్టిన ఘనత ఆయనది. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఒక లెక్క అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చంద్రబాబు నైజమే ఈ వెన్నుపోటు. తన రాజకీయ ప్రయోజనాల కోసం నాడు ఎన్టీఆర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ , మాధవరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇలా అందరి జీవితాలతో ఆడుకున్నారు.
వెన్నుపోటు రాజకీయాలకు ఆదర్శం కూడా చంద్రబాబే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబును ఏరికోరి పార్టీలో చేర్చుకున్నారు ఎన్టీఆర్. కానీ సొంత మామనే వెన్నుపోటు పొడిచి సీఎం పీఠం ఎలా లాక్కున్నారో.. అందుకు నందమూరి కుటుంబ సభ్యులను ఎలా పావుగా వాడుకున్నారో.. వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఎలా చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి రావడానికి ముమ్మాటికీ చంద్రబాబు చర్యలే కారణం. అయితే చంద్రబాబు కుయుక్తులను గమనించిన తెలంగాణ ప్రజలు ఆయనను దూరం పెట్టారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు.
ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుందాం. ఎన్టీఆర్ నుంచి పవర్ లాక్కోవడంలో వారిదే క్రియాశీలక పాత్ర. కానీ ఆ పాత్ర దారులను రూపొందించింది మాత్రం చంద్రబాబు. తాను ఒక్కడే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సీఎం సీటును హస్తగతం చేసుకున్నారు. పార్టీని ఒక వ్యూహం ప్రకారం స్వాధీనం చేసుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ లను ఏ విధంగా సాగనంపారో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక్క బాలకృష్ణ విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించారు. అందుకు వియ్యంకుడు కావడమే కారణం. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సైతం తొక్కి పెట్టారు.
ఎన్టీఆర్ హయాంలో ఎలిమినేటి మాధవరెడ్డి ఓ వెలుగు వెలిగారు. ఆయనను సైడ్ చేసేందుకు చంద్రబాబు ఏ రేంజ్ లో రాజకీయానికి తెర తీశారో అందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ను సైతం తొక్కి పెట్టాలని చూశారు. రాజకీయ భవిష్యత్తుపై దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డిని తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయోగించారు. ఇది గమనించిన రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దూరమయ్యారు. అటు తర్వాత ఎల్. రమణ ను దగ్గర చేసుకున్నారు. చాలా ఏళ్ల పాటు తన ప్రయోజనానికి వాడుకున్నారు. ఇప్పుడు ఆ వంతు కాసాని జ్ఞానేశ్వర్ కు వచ్చింది. అప్పుడెప్పుడో 2007లో పార్టీకి దూరమైన జ్ఞానేశ్వర్ ను చంద్రబాబు దువ్వారు. ఆయనతో తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేయించారు. ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణలో పార్టీని, కాసాని జ్ఞానేశ్వర్ ను పావుగా వాడుకున్నారు. ఇప్పుడు ఉన్నఫలంగా పార్టీని తెలంగాణ జంక్షన్లో విడిచిపెట్టారు. సో తన రాజకీయ జీవితంలో ఈ తరహా ప్రయోగాలు చంద్రబాబుకు కొత్త కాదని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.