Nara Lokesh: తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైనా వారిని ఓడించాలని డిసైడ్ అయ్యింది. ఆ బాధ్యతలను వైసిపి ముఖ్య నేతలకు అప్పగించింది. ఇప్పటికే వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకెళ్తోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. అక్కడ భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి.. నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది. జగన్ నేరుగా వెళ్లి భరత్ ను ఎమ్మెల్యే చేస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు.
అదే సమయంలో కుప్పం తో పాటు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గ బాధ్యతలను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. తన నియోజకవర్గం కంటే ఆ రెండు నియోజకవర్గాల పైనే పెద్దిరెడ్డి ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు దక్కడంతో.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామన్న ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అందుకే నిత్యం పెద్దిరెడ్డి ఆ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెస్తున్నారు. విజయం పై అభయం ఇస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణుల్లో ధీమా వ్యక్తం అవుతోంది.
ఇక మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలను కీలక నేత విజయసాయి రెడ్డికి అప్పగించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఆయనను కాదని గంజి చిరంజీవిని తెరపైకి తేవడంతో.. రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. షర్మిల వెంట నడిచారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులను చక్కదిద్ది లోకేష్ ను ఓడించాలని విజయసాయి రెడ్డి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరిపి.. బీసీ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో వర్గ విభేదాలను సమసి పోయేలా సమన్వయం చేయనున్నారు. కానీ అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తో చాలా మంది నాయకులు వెళ్లిపోయారు. ఉన్న వైసీపీ శ్రేణులు మూడు వర్గాలుగా విడిపోయారు. దీంతో వైసీపీలో ఇక్కడ సమన్వయం సాధ్యమయ్యే పని కాదని విశ్లేషణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.