TDP Janasena Alliance: టిడిపి,జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 112 స్థానాల్లో, జనసేన 63 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ హై కమాండ్ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు లెటర్ హెడ్ తో ఒక ప్రకటన జారీ అయ్యింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇటువంటి ప్రకటనలే పార్టీ అధ్యక్షుడు పేరుతో వచ్చాయి. మరోసారి అటువంటి ప్రత్యేక ప్రకటన రావడంతో ఇరు పార్టీల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. ఏదైనా సీట్ల సర్దుబాటు విషయంలో నేరుగా మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తారు కానీ.. ఇలా ప్రకటన జారీ చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రెండు రోజుల కిందట టిడిపి అభ్యర్థుల జాబితా ఇది అంటూ సోషల్ మీడియాలో 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తూ ఒక ప్రకటన వచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు కీలక నియోజకవర్గం టిడిపి అభ్యర్థుల జాబితా అంటూ హల్ చల్ చేసింది. అయితే దానిని టిడిపి నాయకత్వం ధృవీకరించలేదు. ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేయలేదు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేనకు 63 స్థానాలు కేటాయిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని పార్టీ అధ్యక్షుడి పేరుతో ప్రకటన రావడం అనుమానాలకు తావిస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతనే పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని అటు చంద్రబాబుతో పాటు పవన్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. బిజెపి కోసం ఈ నెలాఖరు వరకు ఎదురు చూసి.. తరువాత కార్యాచరణ ప్రారంభించడానికి ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బిజెపి నుంచి పొత్తుపై ప్రకటన వచ్చిన తరువాతే ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని.. ఉమ్మడి మేనిఫెస్టో నుంచి అభ్యర్థుల ప్రకటన వరకు ఇరు పార్టీలు ఉమ్మడిగానే ప్రకటిద్దామని నిర్ణయానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా జనసేనకు 63 స్థానాలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన చేయడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. గతంలో నకిలీప్రకటనలు వచ్చాయని.. పార్టీ లెటర్ హెడ్ పై నిర్ణయాలు ఇవి అంటూ దుష్ప్రచారం చేసిన విషయాన్ని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నారు. అవి మర్చిపోకమునుపే ఇప్పుడు టిడిపి ప్రత్యేక ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం విశేషం. దీనిపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ప్రకటన చేసేవరకు క్లారిటీ రాదు.